- వచ్చే నెల ఫస్ట్ వీక్‌లో మెరిట్ లిస్ట్
- సెకండ్ వీక్‌లో 1:3 రేషియోలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్
హైదరాబాద్, వెలుగు: డీఎస్సీ ఫలితాలను ఈ నెలాఖరులో విడుదల చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షలకు 2.45 లక్షల మంది హాజరయ్యారు. ఈ నెల 13న రెస్పాన్స్ షీట్లతో పాటు ప్రిలిమినరీ కీని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు రిలీజ్ చేశారు. మంగళవారం సాయంత్రం 5 గంటలతో అభ్యంతరాల స్వీకరణ ముగియనుంది. అభ్యంతరాలపై సబ్జెక్టు ఎక్స్ పర్ట్ కమిటీ సమీక్షించి, ఈ నెలాఖరులోనే ఫైనల్ కీ, ఆ వెంటనే రిజల్ట్స్ విడుదల చేసే చాన్స్ ఉంది. వచ్చేనెల మొదటివారంలో జిల్లాల వారీగా పోస్టులు, వివిధ మీడియంలలో మెరిట్ లిస్టులు రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తున్నది.
1:3 రేషియోలో ఎంపిక
డీఎస్సీలో మెరిట్ అభ్యర్థులకు 1:3 రేషియాలో వచ్చే నెల రెండోవారంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ, పండిట్, పీఈటీ కేటగిరీలో ఒక్కోపోస్టుకు ముగ్గురుచొప్పున సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌కు పిలుస్తారు.
ఎస్జీటీ పరీక్షల్లో రెండ్రోజులూ ఒకే ప్రశ్నలు
గత నెల19న ఫస్ట్ షిఫ్ట్‌లో జరిగిన ఎస్జీటీ తెలుగు మీడియం పరీక్షలో, అదే నెల23న సెకండ్ షిఫ్ట్‌లో జరిగిన ఎస్జీటీ తెలుగు మీడియం పరీక్షలో సోషల్ సబ్జెక్టులోని ప్రశ్నలన్నీ ఒకేరకంగా ఉన్నాయి. అయితే, ఆన్లైన్ పరీక్షలు కావడంతో ఇబ్బందులు ఏమీ ఉండవని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు.
పక్కపక్కన జిల్లాలకూ వేర్వేరు రోజుల్లో జరగడంతో కలిసి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు క్వశ్చన్లు తెలిసే చాన్స్ ఉంది. అయితే, జిల్లాలు వేర్వేరు కావడంతో పాటు పేపర్ బయటకు రాదు కాబట్టి సమస్య ఏమీ ఉండదని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు చెప్తున్నారు.