రోడ్డు ప్రమాదంలో డీఎస్పీ మృతి.. సిద్దిపేట జిల్లాలో ఘటన

రోడ్డు ప్రమాదంలో డీఎస్పీ మృతి.. సిద్దిపేట జిల్లాలో ఘటన

కొండపాక (కుకునూరుపల్లి), వెలుగు: ఇన్నోవా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బోర్డును ఢీకొట్టడంతో ఓ డీఎస్పీ చనిపోయాడు. ఈ ప్రమాదం సిద్దిపేట జిల్లా చిన్నకిష్టాపూర్‌‌ స్టేజ్‌‌ వద్ద శుక్రవారం జరిగింది. ఎస్సై శ్రీనివాస్‌‌ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ పీటీసీలో వైస్‌‌ ప్రిన్సిపాల్‌‌గా పనిచేస్తున్న జవహర్‌‌ లాల్‌‌ (50) శుక్రవారం నంగునూరు మండలం రాజగోపాల్‌‌పేట గ్రామ శివారులో నిర్వహించిన ఫైరింగ్‌‌ ట్రైనింగ్‌‌కు హాజరయ్యారు. అనంతరం పోలీస్‌‌ వాహనంలో తిరిగి మేడ్చల్ పీటీసీకి వస్తున్నాడు.

కుకునూరుపల్లి మండలం చిన్న కిష్టాపూర్‌‌ వద్దకు రాగానే ఓ కారు సడెన్‌‌గా చిన్నకిష్టాపూర్‌‌ గ్రామం నుంచి రాజీవ్‌‌ రహదారిపైకి వచ్చింది. దీంతో డీఎస్పీ ప్రయాణిస్తున్న పోలీస్‌‌ ఇన్నోవా డ్రైవర్‌‌ సడెన్‌‌ బ్రేక్‌‌ వేయడంతో వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న బోర్డ్‌‌కు తగిలింది. దీంతో డీఎస్పీ జవహర్‌‌లాల్‌‌తో పాటు డ్రైవర్‌‌ శ్రావణ్‌‌ తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న కుకునూరుపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆర్‌‌వీఎం హాస్పిటల్‌‌కు తరలించారు. అక్కడ ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటూ డీఎస్పీ చనిపోయాడు. డ్రైవర్‌‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్‌‌ తెలిపారు.