
- పాత కక్షలతోనే మర్డర్ చేశారన్న సోదరుడు
- మృతుడు ధర్మసమాజ్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యదర్శి
పరకాల, వెలుగు : హనుమకొండ జిల్లా నడికూడ మండలంలోని కౌకొండలో మంగళవారం పాత కక్షలతో ధర్మసమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. కౌకొండకు చెందిన మేకల యుగేందర్ (36) ధర్మ సమాజ్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి. యుగేందర్ పెద్దమ్మ ఇటీవలే చనిపోగా సోమవారం దశదినకర్మ ఉండడంతో ఊళ్లో కథ చెప్పించారు. చలిమంట కాగుతూ కథ చూస్తుండగా మంగళవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో వెనక నుంచి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డలితో మెడపై నరికి చంపారు. పాత కక్షలతోనే యుగేందర్ను హత్య చేసినట్లు మృతుడి సోదరుడు రాజవీరు దామెర పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తమ కుటుంబానికి ఇంటిస్థలం విషయంలో పాలి పగలు ఉన్నాయని, గతంలోనే వారు తన తమ్ముడు యుగేందర్ ఎక్కువ చేస్తున్నాడని, వాడి సంగతి చూస్తామని చెప్పారని, అన్నంత పని చేశారని రాజవీరు రోదించాడు. కథ చూస్తున్న తన తమ్ముడు యుగేందర్ను గొడ్డలితో నరికి చంపాడని పేర్కొన్నాడు. పరకాల రూరల్ సీఐ మల్లేశ్, దామెర ఎస్సై అశోక్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఎస్సై చెప్పారు.