కోర్టు ధిక్కారం కేసులో డీఎస్పీ, ఎస్సైలకు జరిమానా

కోర్టు ధిక్కారం కేసులో డీఎస్పీ, ఎస్సైలకు జరిమానా
  •  మరో ఇద్దరికి ఫైన్, జైలు శిక్ష 

శివ్వంపేట, వెలుగు : కోర్టు ధిక్కారం కేసులో ఇదివరకు తూప్రాన్ డీఎస్పీగా పనిచేసిన యాదగిరి రెడ్డి, శివ్వంపేట ఎస్సైగా పనిచేసిన రవికాంత్​ రావుకు హైకోర్టు జరిమాన విధించింది. కరుణాకర్ రెడ్డి, ఇతడి కుటుంబ సభ్యులకు శివ్వంపేట మండలం సికింద్లాపూర్ లో 50 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని విల్లా ప్రాజెక్ట్ గా డెవలప్​ చేసేందుకు ఇష్టా బిల్డర్స్ అండ్ డెవలపర్స్​తో అగ్రిమెంట్ చేసుకున్నారు. 

ఒప్పందం ప్రకారం నిర్ణీత కాలంలో భూమిని డెవలప్ ​చేయకపోవడంతో ఇరుపక్షాల మధ్య గొడవ జరిగింది. ఇష్టా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ డైరెక్టర్స్ జి.సందీప్, నిఖిల్ రెడ్డి దౌర్జన్యంగా కరుణాకర్ రెడ్డి కుటుంబపు భూమిలో చొరబడేందుకు ప్రయత్నించారు. దీంతో శివ్వంపేట పీఎస్​లో బాధితులు ఫిర్యాదు చేశారు. అప్పట్లో తూప్రాన్ డీఎస్పీగా ఉన్న యాదగిరి రెడ్డి, శివ్వంపేట ఎస్సై రవికాంత్​ రావు... సందీప్, నిఖిల్ రెడ్డికి సహకరించారు. 

అంతేగాక సివిల్ వివాదంలో తలదూర్చి అక్రమార్కులకు అండగా నిలిచి కరుణాకర్ రెడ్డి కుటుంబసభ్యులను భయపెట్టారు. దీంతో కరుణాకర్ రెడ్డి ఫ్యామిలీ హైకోర్టులో రిట్​దాఖలు చేసింది.  ఈ కేసులో కోర్టు ఏప్రిల్ 25న స్టేటస్ కో ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వులు అమల్లో ఉండగానే సందీప్, నిఖిల్ రెడ్డి.. కరుణాకర్ రెడ్డి భూమిలో చొరబడేందుకు యత్నించారు. 50 టన్నుల మామిడి పండ్లను ఎత్తుకువెళ్లారు. 

దీనికి డీఎస్పీ యాదగిరి రెడ్డి, శివ్వంపేట ఎస్సై రవికాంత్​ రావు సహకరించారు. దీంతో హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేయగా డీఎస్పీ, ఎస్ఐలకు రూ.2వేల  చొప్పున ఫైన్​ వేస్తూ తీర్పు ఇచ్చింది. సందీప్, నిఖిల్ రెడ్డికినెల జైలు శిక్ష, యాభై వేల జరిమానా విధించింది. 

కొద్దిరోజుల కింద ఎస్​ఐ సస్పెన్షన్​​

తమ భూమిలో నిందితులు చొరబడి  మామిడి పండ్లు చోరీ చేశారని ఎస్ఐ రవికాంత్​రెడ్డికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అప్పట్లోనే కరుణాకర్​ రెడ్డి కుటుంబసభ్యులు ఉన్నతాధికారులకు కంప్లయింట్​ చేశారు. వారు విచారణ చేస్తుండగానే సిద్దిపేట జిల్లా భూంపల్లికి ఎస్​ఐ బదిలీ అయ్యారు. ఈ క్రమంలో ఎంక్వైరీ పూర్తి చేసిన ఆఫీసర్లు.. ఆరోపణలు నిజమేనని తేలడంతో కొద్ది రోజుల కింద సస్పెండ్​ చేశారు. మరోవైపు డీఎస్పీ యాదగిరి రెడ్డిని తూప్రాన్​ నుంచి డీజీపీ ఆఫీసుకు అటాచ్​ చేశారు.