- ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
- కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి..
కామారెడ్డి, వెలుగు : తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తి వద్ద భారీగా డబ్బులు తీసుకున్న డీఎస్పీ ఉదంతం కామారెడ్డి జిల్లా కేంద్రంలో చర్చనీయాంశమైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కామారెడ్డి డీసీఆర్బీలో పని చేస్తున్న డీఎస్పీ మదన్‌లాల్ కొద్దిరోజుల కింద జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తికి పరిచయం అయ్యాడు. తన వద్ద కొంత బంగారం ఉందని తక్కువ ధరకు ఇప్పిస్తానని డీఎస్పీ చెప్పగా..
నిజమేనని నమ్మి సదరు వ్యక్తి రూ. 20 లక్షల వరకు ముట్టజెప్పినట్లు సమాచారం. రోజులు గడుస్తున్నా బంగారం ఇప్పించకపోవటం, డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవటంతో బాధితుడు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. పది రోజుల కింద సదరు డీఎస్పీని డీజీపీ ఆఫీస్‌కు అటాచ్‌చేశారు.
ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు రహస్యంగా దర్యాప్తు చేశారు. డబ్బులు తీసు కొని బంగారం ఇవ్వని విషయం వాస్తవమేనని తేలినట్లు తెలిసింది. దీంతో డీఎస్పీని ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.