మక్తల్, వెలుగు: మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని బీసీ కాలనీలో ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయాలని డీటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు హైమావతి కోరారు. బుధవారం ఆమె ఏంఈవో అనిల్ గౌడ్ కు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీసీ కాలనీలో బుడగజంగాలు, సంచార జీవితం గడిపే వారు నివసిస్తున్నారని తెలిపారు. 160 మంది పిల్లలుండగా, వీరిలో 84 మంది విద్యార్థులు ఐదేండ్లు పైబడి ఉన్నవారున్నారని పేర్కొన్నారు.
ఇంత మంది పిల్లలు ఉన్నప్పటికీ, ఇక్కడ ప్రైమరీ స్కూల్, అంగన్వాడీ సెంటర్ లేదన్నారు. దీంతో 3 కిలోమీటర్లు నడుస్తూ పట్టణంలోని వివిధ పాఠశాలలకు వెళ్తున్నారని చెప్పారు. గతంలో ఏర్పాటు చేసిన స్కూల్ మూతపడడంతో పిల్లల పరిస్థితి దయనీయంగా ఉందని, వెంటనే స్కూల్ ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. జిల్లా కార్యదర్శి సూర్యచంద్ర, పరంజ్యోతి, చంద్రశేఖర్, పరంధాములు పాల్గొన్నారు.