పర్యావరణ పరిరక్షణ, సుస్థిరతను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ప్రభుత్వం, పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే వ్యక్తులకు సుదీర్ఘకాల రెసిడెన్సీ వీసాను తీసుకురానున్నది. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో బ్లూ రెసిడెన్సీ వీసాల జారీకి ఆమోదం తెలిపినట్లు యూఏఈ ప్రధాన మంత్రి షేక్ మహమ్మద్ బిన్ రషీద్ వెల్లడించారు.
పదేండ్లపాటు యూఏఈలో నివాసం ఉండేందుకు వీలుగా ఈ ప్రత్యేక బ్లూ వీసాలను ఇవ్వనున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించేలా పలు రంగాల్లో అసాధారణ కృషి చేసిన వ్యక్తులకు వీటిని జారీ చేస్తారు.
మెరైన్ లైఫ్, భూ ఉపరితలంపై పర్యావరణ వ్యవస్థ, గాలి నాణ్యత, సుస్థిర సాంకేతికత తదితర రంగాల్లో పనిచేస్తున్నవారు ఈ వీసాలకు అర్హులు. వీటికోసం ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
వీసాలు పొందే వ్యక్తులకు యూఏఈలో దీర్ఘకాలిక నివాసంతోపాటు పర్యావరణ ప్రాజెక్టుల్లో సహకారం అందించే అవకాశాలు లభిస్తాయి. పర్యావరణ పరిరక్షణకు వారు చేపట్టే చర్యలకు నిధులు, వనరులను కూడా ప్రభుత్వం నుంచి తీసుకునే వెలుసుబాటు ఉంటుంది.
యూఏఈ ఇప్పటికే పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలు, అసాధారణ ప్రతిభ కలిగిన గ్రాడ్యుయేట్లకు 10ఏండ్ల కాలపరిమితితో ప్రత్యేకమైన గోల్డెన్ వీసాలను అందిస్తోంది. మన దేశానికి చెందిన పలువురు సినీ ప్రముఖులకు ఈ వీసాలు లభించాయి. దీంతోపాటు గ్రీన్ వీసా, రిమోట్ వర్కింగ్ వీసాలను ఇటీవల కాలంలో ప్రత్యేకంగా తీసుకువచ్చారు.