Champions Trophy: ఒకే హోటల్‌, ఒకే స్టేడియం, ఒకే పిచ్‌.. భారత్‌కు అడ్వాంటేజ్: వాన్ డెర్ డస్సెన్

Champions Trophy: ఒకే హోటల్‌, ఒకే స్టేడియం, ఒకే పిచ్‌.. భారత్‌కు అడ్వాంటేజ్: వాన్ డెర్ డస్సెన్

దుబాయిలో మ్యాచ్‪లు భారత జట్టుకు అడ్వాంటేజ్ అన్న వాదనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ విషయంపై ఇతర జట్ల క్రికెటర్లు ఒక్కొక్కరిగా పెదవి విరుస్తున్నారు. మొదట ఈ విషయాన్ని అన్నీ జట్లు తేలిగ్గా తీసుకున్నప్పటికీ, ఆఫ్గనిస్తాన్ చేతిలో ఇంగ్లాండ్ ఓటమి తరువాత.. ఆ దేశ మాజీలు ఈ విషయాన్ని వివాదాస్పదంగా మార్చేశారు.

తాజాగా, ఈ విషయంపై సౌతాఫ్రికా బ్యాటర్ రాస్సీ వాన్ డెర్ డస్సెన్ స్పందించారు. ఒకే రకమైన పరిస్థితులు.. ఒకే స్టేడియంకు చెందిన పిచ్‌లపై ప్రాక్టీస్ ఖచ్చితంగా జట్టుకు ప్రయోజనమని వాన్ డెర్ డస్సెన్ అన్నారు. ఈ మాత్రం తెలియడానికి రాకెట్ శాస్త్రవేత్తలై ఉండాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించాడు. అదే సమయంలో ప్రధాన కోచ్ ఆకిబ్ జావేద్ చేసిన వ్యాఖ్యలను వాన్ డెర్ డస్సెన్ ప్రస్తావించాడు.

"ఎవరైనా కావొచ్చు ఒకే చోట.. ఒకే హోటల్‌లో ఉండగలిగి.. ఒకే స్టేడియంలో ప్రతిసారీ ఒకే పిచ్‌లపై ఆడగలిగితే అది ఖచ్చితంగా ఒక ప్రయోజనం. ఇది తెలియడానికి రాకెట్ శాస్త్రవేత్త అయి ఉండాల్సిన అవసరం లేదు. ఆ ప్రయోజనాన్ని ఉపయోగించుకునే బాధ్యత వారిపై ఉంటుంది. మరో కోణంలో ఇది వారిపై ఒత్తిడి పెంచుతుంది.."

"ఒకే పిచ్‌లపై ఆడటం వల్ల వారు అప్పటికే అలవాటు పడి ఉంటారు. ఇతర జట్లకు అలా కాదు. సెమీస్ లేదా ఫైనల్‌ ఏదైనా కావొచ్చు.. అక్కడికి వెళ్తే పరిస్థితులు విదేశీ పిచ్‌లు అన్నట్లుగా ఉంటాయి. అలాంటప్పుడు అడ్వాంటేజ్ ఉన్న జట్టుకు దాన్ని సరిగ్గా పొందాలనే భావన ఒత్తిడి పెంచుతుంది.." అని వాన్ డెర్ డస్సెన్ అన్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్నప్పటికీ.. భారత జట్టు మ్యాచ్‪లు దుబాయి గడ్డపై జరుగుతున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్‌లో ఆడేందుకు బీసీసీఐ నిరాకరించడంతో.. ఐసీసీ ఈ ఏర్పాట్లు చేసింది. టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో జరిగేలా పాకిస్థాన్‌ను ఒప్పించి.. దుబాయ్ స్టేడియంలో టీమిండియా మ్యాచ్‌లు నిర్వహిస్తోంది.