పుట్టింది దుబాయ్‌లో.. చదువుకుంది అమెరికాలో. కానీ.. సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌ని సంపాదించుకుంది ఇండియాలో. ఖలీద్ తన దేశంలో ఎంత పాపులర్ అయ్యాడో.. ఇండియాలో కూడా అంతే పాపులర్. అతనికి మన ఫుడ్ అంటే ఇష్టం. మన కల్చర్ అంటే గౌరవం. అందుకే అతనంటే మనవాళ్లకు అభిమానం. అతను ఇండియన్ కంపెనీలను కూడా ప్రమోట్ చేస్తున్నాడు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టిని కూడా ఇంటర్వ్యూ చేశాడు.
ఖలీద్..1983 డిసెంబర్ 5న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అబుదాబిలో పుట్టాడు. వాళ్ల అమ్మానాన్నలది ప్రేమ వివాహం. నాన్నది అబుదాబి, అమ్మది స్కాట్‌లాండ్. అబుదాబిలో నాన్న అకౌంటెంట్‌గా, అమ్మ నర్సుగా పనిచేసేవాళ్లు. వాళ్లకు ముగ్గురు సంతానం. అందులో ఖలీద్ పెద్దవాడు.ఇతనికి ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. ఖలీద్ అబుదాబిలోని ‘అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్’లో చదువుకున్నాడు. తర్వాత యూకేలో గ్రాడ్యుయేషన్ చేశాడు. అబుదాబికి తిరిగొచ్చి ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ‘ముబాదలా డెవలప్‌మెంట్’లో చేరాడు.
తొమ్మిదేళ్లపాటు అందులోనే పనిచేసిన ఖలీద్.. సీనియర్ అసోసియేట్ లెవల్‌కి ఎదిగాడు. తర్వాత ‘లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ క్లినిక్’లో మేనేజర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత అమెరికా వెళ్లాడు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. అయితే అమెరికాలో ఉన్నప్పుడే అతనికి మీడియాపై ఆసక్తి పెరిగింది. దాంతో తిరిగొచ్చాక కొంతకాలం పాటు జర్నలిస్ట్‌గా పనిచేశాడు. ముఖ్యంగా ‘ది నేషనల్’ లో రైటర్‌గా, కొన్నాళ్లపాటు ‘గల్ఫ్టుడే’కు కాలమిస్ట్‌గా ఉన్నాడు. ఆ తర్వాత సీఎన్ఎన్ ఛానెల్లో ప్రెజెంటర్‌గా చేరాడు. అప్పుడే ‘రంజాన్ సిరీస్’ పేరుతో ఒక వీక్లీ ప్రోగ్రాం చేశాడు. అది చాలా పాపులర్ అయ్యింది. కానీ.. కొన్నాళ్లకే ఉద్యోగం వదిలేసి సోషల్‌మీడియాలోకి వచ్చేశాడు.
ఇన్ఫ్లుయెన్సర్గా..
సక్సెస్ఫుల్ జర్నలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నప్పటికీ ఖలీద్‌కు కంటెంట్ క్రియేటర్ కావాలనే కోరిక ఉండేది. అందుకే 2011లో ‘‘ఖలీద్ అల్ అమేరి” పేరుతో యూట్యూబ్ ఛానెల్ పెట్టాడు. కానీ.. అప్పుడు వీడియోలు చేయలేదు. ఐదేండ్ల నుంచి రెగ్యులర్‌గా కంటెంట్ వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు. మొదట్లో ఖలీద్ కామెడీ, ఫ్యామిలీ థీమ్‌లతో వీడియోలు చేశాడు. అవి వ్యూయర్స్‌కి బాగా నచ్చడంతో ఛానెల్‌కు మంచి పేరొచ్చింది. ఇప్పుడు ఖలీద్ అబుదాబిలోని అతిపెద్ద ఇన్ఫ్లుయెన్సర్లలో ఒకరు. అతని ఛానెల్‌కు 4.35 మిలియన్ల సబ్స్క్రయిబర్లు ఉన్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో 3మిలియన్లకుపైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పటివరకు ఛానెల్లో174 వీడియోలు అప్లోడ్ చేశాడు. ఛానెల్లోని ఒక షార్ట్ వీడియోకు ఏకంగా142 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఆ వీడియోని ఇండియాలోనే తీశాడు. ఖలీద్ రెగ్యులర్‌గా ఇండియాకు వస్తుంటాడు. అంతెందుకు అతను మమ్ముట్టిని కూడా ఇంటర్వ్యూ చేశాడు. ఆ వీడియోని తన ఛానెల్లో పోస్ట్ చేశాడు. కాకపోతే.. ఛానెల్లో కొన్నాళ్ల నుంచి పెద్ద వీడియోలు పోస్ట్ చేయడం లేదు. షార్ట్ వీడియోల మీదే ఫోకస్ పెట్టాడు. ఖలీద్ కంటెంట్ క్రియేటర్ మాత్రమే కాదు.. మంచి వ్యాపారవేత్త కూడా. అతను దుబాయ్‌లో ‘ఖలీద్ అల్ అమెరీ మీడియా’ అనే డిజిటల్ మీడియా కంపెనీని స్థాపించాడు. బిజినెస్ చూసుకుంటూనే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాడు.
భార్యతో విడాకులు
ఖలీద్ మాజీ భార్య సలమా మొహమ్మద్ కూడా ఒక కంటెంట్ క్రియేటర్. ఆమె కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువగా వీడియోలు పోస్ట్ చేస్తుంటుంది. వాళ్లకు ఇద్దరు పిల్లలు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఖలీద్ సలమాకు విడాకులు ఇచ్చాడు. గతంలో ఖలీద్ ఆమెతో కలిసి బ్యూటీ బ్రాండ్ ‘పీస్ ఫుల్’ని కూడా స్థాపించాడు.
సునయనతో ఎంగేజ్‌మెంట్?
కొన్ని నెలల క్రితం తమిళ నటి సునయన ఇన్‌స్టాగ్రామ్‌లో చేతులు మాత్రమే కనిపించే ఎంగేజ్‌మెంట్ ఫొటోని షేర్ చేసింది. దానికి లైక్ కొట్టిన ఖలీద్ కూడా కొన్నాళ్లకు అలాంటి ఫొటోనే పోస్ట్ చేశాడు. దాంతో వీరిద్దరికీ నిశ్చితార్థం అయ్యింది అనుకున్నారు నెటిజన్లు. ఆ టైంలో ఖలీద్‌కు సునయనతో పెళ్లి జరగబోతుందని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.