- ఏడాదిన్నరలో కురవాల్సిన వర్షం 24 గంటల్లోనే
- 1949 తర్వాత ఇదే అత్యధిక వర్షపాతంగా రికార్డ్
కుండపోత వర్షంతో దుబాయ్ అల్లకల్లోలంగా మారింది. రోడ్లు, మెట్రో రైల్ స్టేషన్లు, షాపింగ్ మాల్స్‌ను వరదలు ముంచెత్తాయి. జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. స్కూళ్లు, ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. బహ్రెయిన్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియాతోపాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అంతటా వర్షాలు పడుతున్నాయి. దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద కుంభవృష్టి అని దుబాయ్ అధికారిక మీడియా పేర్కొంది. ఒక్క దుబాయ్ నగరంలోనే సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రిలోపు 142 మిల్లీమీటర్ల వర్షం పడింది. అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ ఎయిర్‌పోర్టు నీట మునిగింది. దీంతో 500కు పైగా విమానాలను దారి మళ్లించారు. భారత్, దుబాయ్ మధ్య నడిచే 28 విమానాలను రద్దు చేశారు.
దుబాయ్: దుబాయ్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. మంగళవారం కురిసిన కుండపోత వర్షంతో నగరం అల్లకల్లోలంగా మారింది. రోడ్లు, మెట్రో రైల్ స్టేషన్లు, షాపింగ్ మాల్స్‌ను వరదలు ముంచెత్తాయి. అకస్మాత్తు వర్షాలకు దుబాయ్ అతలాకుతలమైంది. భారీ వరదలకు జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. స్కూళ్లు, ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. బహ్రెయిన్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియాతోసహా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) అంతటా వర్షాలు పడుతున్నాయి. దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద కుంభవృష్టి అని, 1949 తర్వాత ఇంతటి స్థాయిలో వర్షం పడటం ఇదే తొలిసారి అని దుబాయ్ అధికారిక మీడియా పేర్కొంది.
ఒక్క దుబాయ్ నగరంలోనే సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రిలోపు 142 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఇది ఏడాదిన్నరలో కురవాల్సిన వర్షానికి సమానం అని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, ఈ అసాధారణ వర్షాలకు క్లౌడ్ సీడింగే కారణమని యూఏఈ నేషనల్ సెంటర్ ఫర్ మెటియోరాలజీ సైంటిస్ట్‌లు చెప్పినట్లు పలు రిపోర్టులు వెల్లడించాయి. దుబాయ్ ప్రభుత్వం ఆది, సోమవారాల్లో క్లౌడ్ సీడింగ్ కోసం ఏడు విమానాలను నడిపిందని పేర్కొన్నాయి. ప్రభుత్వం మాత్రం క్లౌడ్ సీడింగ్ గురించి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
28 విమానాలు రద్దు
ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ ఎయిర్‌పోర్టు నీట మునిగింది. కొన్ని గంటల్లోనే ఎయిర్‌పోర్టు వద్ద 20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రన్‌వే ప్రాంతమంతా మోకాలి లోతు వరదలు వ్యాపించాయి. దీంతో 500కు పైగా విమానాలను దారి మళ్లించారు. భారత్, దుబాయ్ మధ్య నడిచే 28 విమానాలను రద్దు చేశారు. ఇందులో దుబాయ్‌కి వెళ్లాల్సిన 15, దుబాయ్ నుంచి రావాల్సిన 13 ప్లేన్లను ఎయిర్‌పోర్టు వర్గాలు క్యాన్సిల్ చేశాయి. అత్యవసరమైతే తప్ప ఎయిర్‌పోర్టుకు రావొద్దని ప్రయాణికులను హెచ్చరించాయి.
ఒమన్‌లో 18 మంది మృతి
భారీ వర్షాలకు ఒమన్ అతలాకుతలం అయింది. మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఒమన్ రాజధాని మస్కట్‌తో సహా అనేక ప్రాంతాల్లో కార్లు వరదల్లో కొట్టుకుపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆదివారం రాత్రి నుంచి బుధవారం మధ్య ఒక్క ఒమన్‌లోనే 230 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయిందని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు తెలిపారు. రెండేండ్లలో పడాల్సి వర్షం ఈ మూడ్రోజుల్లోనే కురిసిందని వెల్లడించారు.