దుబ్బాక ఉప ఎన్నిక.. మార్పుకు సంకేతం

ప్రజాస్వామ్యం లో అధికారం స్థిరంగా ఉండదు. కొన్నిసార్లు అలా కనిపించినా శాశ్వత అధికారమన్నది ఎన్నడూ ఉండదు. అధికారంతోపాటు అహంకారాన్ని పెంచుకునే వ్యక్తులు ఎప్పుడో అప్పుడు గుణపాఠం నేర్చుకుంటారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ , టీఆర్‌ఎస్‌ కు దుబ్బాక ఉపఎన్నిక అలాంటి గుణపాఠమే.

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఇది మొదటిసారేం కాదు. ఈ ప్రాంతంలో ఉపఎన్నికలో విజయం సాధించడం కూడా తొలిసారి కాదు. ఇదే చివరిసారి కూడా కాబోదు. మొన్నటి లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ సీట్లు కైవసం చేసుకుంది. రాష్ట్రంలోని రాజకీయ పండితుల దృష్టిలో అది ఊహించని విజయం. తెలంగాణలో బీజేపీ ఎదుగుదల ఏదో తేలిగ్గా తీసుకునే వ్యవహారం కాదు. ప్రతీ గెలుపు రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేసి మరిన్ని ఎన్నికల విజయాలు అందుకునేలా చేసేదే. దుబ్బాక ఉపఎన్నిక పాఠం, యుక్తులు, వ్యూహాలను ఆకళింపు చేసుకుంటే అది మార్పుకు సంకేతంగా కనిపిస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ విజయం పునరావృతం కావచ్చు. భారత రాజకీయ వ్యవస్థలో 40 ఏండ్లుగా ఉన్న బీజేపీకి దేశవ్యాప్తంగా అనుభవాలు పుష్కలంగా ఉన్నాయి. 1984 సాధారణ ఎన్నికల్లో రెండు ఎంపీ స్థానాలతో మొదలైన బీజేపీ ప్రస్థానం 2019లో 303 ఎంపీ స్థానాలకు చేరుకుంది. ఆసక్తి కలిగిన వారికి దుబ్బాక ఉపఎన్నిక, ఆ ఫలితం కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్పిస్తుంది.

అహంకారానికి భారీ మూల్యం

2019 లోక్​సభ ఎన్నికల ఫలితాల నుంచి టీఆర్​ఎస్‌‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌‌ రావు, వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ కె.తారకరామారావు, పార్టీ సీనియర్‌‌ నేత టి.హరీశ్​రావు ఎటువంటి పాఠాలు నేర్వలేదన్నది సుస్పష్టం. అధికారంలో ఉన్నప్పుడు నేర్చుకోవడమన్నది చాలా కష్టంతో కూడుకున్న పని. అధికారం కోల్పోయిన తర్వాత ఎలాగో ఆత్మపరిశీలన చేసుకునేందుకు సమయం పుష్కలంగా ఉంటుంది. దుబ్బాకలో విజయం నల్లేరు మీద నడకని అపోహ పడిన కేసీఆర్‌‌, కేటీఆర్‌‌ అక్కడ ప్రచారం చేయలేదు. ఆ ఎన్నికలో ప్రచారం చేయాల్సిన అవసరం లేదని భావించడం వారి అహంకారానికి నిదర్శనం. ఏదైనా ఎన్నికను తేలిగ్గా తీసుకోవడం, విపక్షాలను తక్కువగా అంచనా వేయడం, ముందుగానే విజయాన్ని ఊహించడం వంటివి చాలా సందర్భాల్లో రాజకీయ వైఫల్యాలకు దారితీస్తాయి. రాజకీయాల్లో అహంకారానికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది, కొన్నిసార్లు అది ఆత్మహత్యసదృశ్యం అవుతుంది.

ప్రతీసారి ఓటమి ఉండదు

ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవచ్చు. దానర్థం ప్రతీసారి ఓటమిపాలవుతారని కాదు. గతంలో రఘునందన్‌‌రావు రెండుసార్లు ఓటమిపాలయ్యారు. అలాగని ఆయనను ఓటర్లు శాశ్వతంగా తిరస్కరిస్తారని కాదు. అభ్యర్థి మంచివారని భావిస్తే ఓటర్లు వారి వైపు మళ్లవచ్చు. గతంలో ఇది ఎన్నోసార్లు రుజువైంది. ఈ ఎన్నిక ద్వారా మరోసారి నిరూపితమైంది.

దుబ్బాక ఎన్నికల ఫలితాన్ని జీహెచ్‌‌ఎంసీలోనూ చూపాలనే విశ్వాసం బీజేపీలో కనిపిస్తోంది. టీఆర్‌‌ఎస్‌‌లో లోపాలను, అది చేస్తున్న తప్పిదాలను బీజేపీ గుర్తించింది. దీనికి తోడు కింది స్థాయిలో పార్టీ పుంజుకోవడంతో ముందు ముందు బీజేపీ ఖాతాలో మరిన్ని విజయాలు పడటం ఖాయం.

బీజేపీ విజయస్ఫూర్తి
అభ్యర్థి శ్రద్ధా సక్తులతో పాటు దుబ్బాక స్థానాన్ని ఎలాగైనా గెలవాలని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌ తపన, ఉత్తమ పనితీరు కనబరచాలనే పార్టీ కేడర్‌
సంకల్పంతో ఈ ఫలితం సాధ్యమైంది. తెలంగాణలో కాంగ్రెస్‌ ను అధిగమించి, భవిష్యత్‌ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ కు స్పష్టమైన ప్రత్యామ్నాయంగా బీజేపీ నిలుస్తుందనే విషయాన్ని ఈ విజయం తేటతెల్లం చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉపఎన్నికలు జరిగిన 12 రాష్ట్రాల్లో ఎక్కువ స్థానాల్లో బీజేపీ విజయం సాధించడం వెనుక ఈ సంకల్పమే ఉంది. బీహార్‌ లో మరోసారి విజయం సాధించి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుండటం ఆషామాషీ విషయం కాదు. భాగస్వామి జేడీయూ కంటే ఎక్కువ స్థానాలు గెలవడం బీహార్‌ లో బీజేపీ ముద్ర బలపడిందనే విషయాన్ని తెలియజేస్తోంది.

కాంగ్రెస్‌-ఒక మోయలేని భారం
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తన ఓటర్లను కోల్పోతోంది. ఆధారపడేందుకు తనకు ఓటు-బ్యాంక్‌ లేదనే విషయాన్ని దుబ్బాక ఉపఎన్నిక ఫలితం ద్వారా కాంగ్రెస్‌‌ పార్టీ గ్రహించి ఉంటుంది. కాంగ్రెస్‌‌ పార్టీకి ఉన్న సంప్రదాయ ఓటు పునాది తుడిచిపెట్టుకు పోయింది. ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌‌ పార్టీకి అండ లేకుండా పోయింది. ఇప్పుడది తన మనుగడ కోసం పోరాటం చేస్తున్న పరిస్థితి. తన బలహీనమైన పనితీరుతో బీహార్‌ లో కూటమి భాగస్వామి ఆర్జేడీకి కాంగ్రెస్‌‌ ఒక భారంగా మారింది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌ ఎన్నికల్లో ఏ ప్రాంతీయ పార్టీకి కూడా కాంగ్రెస్‌‌ పార్టీతో పొత్తు పెట్టుకునే పరిస్థితి ఉండదు. బీహార్‌ ఫలితాలు చూసిన తర్వాత ఏదైనా కూటమిలో తగిన సంఖ్యలో స్థానాలు కావా లని కోరుకునే శక్తి కాంగ్రెస్‌‌లో ఉండకపోవచ్చు. కాంగ్రెస్‌‌ పార్టీకి అంతటా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి . పెద్ద సంఖ్యలో నాయకులు ఇతర పార్టీల్లోకి వలస వెళ్తున్నా రు. ఈ పరిస్థితుల్లో నిశ్చలంగా ఉన్నది బీజేపీయే. పార్టీ పతనానికి కాంగ్రెస్‌‌ జాతీయ నాయకత్వమే కారణం. దానికి ఇతరులను నిందించాల్సిన అవసరం లేదు.

టీఆర్ఎస్‌‌ పతనం

పెరుగుట విరుగుట కొరకే అన్న మాట ప్రతీదానికి, ప్రతీ ఒక్కరికీ వర్తిస్తుంది. 2014 నుంచి టీఆర్‌‌ఎస్‌‌ ఎంతో అద్భుతంగా ఎదుగుతోంది. 2018లో రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ సంపూర్ణ మెజార్టీ సాధించింది. ఈ ఎదుగుదల శాశ్వతంగా నిలిచిపోతుందని కేసీఆర్‌‌, ఆయన కుటుంబం భావించినట్టు అయితే ఆ కల త్వరలోనే చెదిరిపోతుంది. టీఆర్‌‌ఎస్‌‌ పార్టీలో అంతర్గతంగా ఎన్నో విభేదాలున్నాయి. అవి బడబాగ్నిలా ఎగిసిపడే దిశగా కదులుతున్నాయి. పార్టీలో అంతా బాగుందని చాటిచెప్పేందుకు జీహెచ్‌‌ఎంసీ ఎన్నికలు టీఆర్‌‌ఎస్‌‌కు మధ్యంతర పరీక్షగా ఉండబోతున్నాయి. పార్టీ లక్ష్యాల మేరకు నాయకులు పనిచేయకపోతే, జీహెచ్‌‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌‌ఎస్‌‌ ఓటమిపాలవడం తథ్యం. అదే జరిగితే తెలంగాణలో టీఆర్‌‌ఎస్‌‌ పతనం మొదలైనట్లే.-కె.కృష్ణసాగర్‌‌ రావు, బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి