
- ఓ మీటింగ్‌లో ఎమ్మెల్యేగా గెలిపించాలన్న మంత్రి హరీశ్‌రావు
- కొత్తను వ్యతిరేకిస్తున్న పలువురు అసంతృప్త నేతలు
- మరోవైపు తమ పరిస్థితి ఏందంటున్న సోలిపేట ఫ్యామిలీ
- తానూ రేసులోను ఉన్నానంటున్న మామిడి మోహన్ రెడ్డి
సిద్దిపేట, వెలుగు: దుబ్బాక సెగ్మెంట్‌లో కొత్త రాజకీయం మొదలైంది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని హైకమాండ్ సంకేతాలు ఇవ్వడంతో ఆయన నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. ఏడు నియోజకవర్గాలకు ఎంపీ అయినా అభివృద్ధి పనుల పేరిట కేవలం దుబ్బాకలోనే పర్యటిస్తున్నారు. అయితే కొత్త అభ్యర్థిత్వాన్ని కొందరు అసంతృప్త నేతలు వ్యతిరేకిస్తున్నారు. గతంలోనే తమ దారి తాము చూసుకుంటామని చెప్పిన దుబ్బాక మండలానికి చెందిన బీఆర్ఎస్ నేతలు ఓ సారి సమావేశం కూడా అయ్యారు. అయితే కొన్నాళ్లుగా సైలెంట్‌గా ఉన్న వాళ్లు ఇటీవల ప్రభాకర్ రెడ్డి దూకుడు పెంచడంతో మళ్లీ ఒకతాటిపైకి వస్తున్నట్టు తెలిసింది. మరోవైపు సోలిపేట వర్గం, ఇంకోవైపు మామిడి మోహన్ రెడ్డి వర్గం కూడా యాక్టివ్ అయ్యింది.
పార్టీ సంకేతాలతోనే ప్రజల్లోకి..
దుబ్బాక అసెంబ్లీ టికెట్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికే ఖరారైనట్లు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన బహిరంగ సభలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ ఏకంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకరెడ్డి అని సంబోధించారు. అలాగే ఇటీవల సిద్దిపేటలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు సైతం దుబ్బాక ఎమ్మెల్యేగా గెలవగానే గణేశ్ నగర్ ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలని సూచించడం గమనార్హం. దీంతో ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గంలోని మండలాల్లో అన్నీ తానై ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అసంతృప్త నేతలను బుజ్జగిస్తున్నట్లు తెలిసింది. తొగుట మండలంలో యూత్ అధ్యక్ష పదవి ఎంపిక విషయంలో నేతల మధ్య విభేదాలు రాగా.. మిరుదొడ్డిలోని ఓ ప్రవేట్ ఫంక్షన్ హాల్‌కు పిలిపించి నచ్చజెప్పినట్లు తెలిసింది. మండల పరిధిలోని ఓ గ్రామ సర్పంచ్ పార్టీలో తగిన ప్రాధాన్యత దక్కడం లేదని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగా.. అతన్ని పిలిపించుకుని మాట్లాడారు. ఇదే సమయంలో టికెట్ ఆశిస్తున్న నేతలను దూరం పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
దుబ్బాక కేంద్రంగా అసంతృప్త సెగలు
ప్రభాకర్ రెడ్డి పని చేసే వారిని పక్కకు పెట్టి, భజన చేసే వారికే ప్రాధాన్యం ఇస్తారని మొదటి నుంచి ప్రచారం ఉంది. ఆయనను వ్యతిరేకిస్తున్న నేతలు ఉప ఎన్నికల్లో తన స్వగ్రామంలోనే బీజెపీకి మెజార్టీ వచ్చిందని గుర్తు చేస్తున్నారు. దుబ్బాక మండలానికి చెందిన మాజీ సర్పంచ్‌లు శ్రీరాం రవీందర్ , మూర్తి దామోదర్ రెడ్డి, సాందిరీ బాలకిషన్, మాడగుల అంజయ్య, కడుదుల భూపతి రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్దిరాములు, మాజీ ఎంపీటీసీ - యాదవ రెడ్డి, పీఎసీఎస్ డైరక్టర్ బాల్ రెడ్డి, ఎంపీ స్వగ్రామమైన పోతారం సర్పంచ్ గడీల జనార్దన్ రెడ్డితో పాటు నియోజకవర్గానికి చెందిన మరికొంత మంది నేతలు అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో వీరంతా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించినా.. పార్టీ పెద్దలు జోక్యం చేసుకోవడంతో సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం ఎన్నికల సమీపిస్తుండడంతో భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించే పనిలో పడ్డట్లు సమాచారం. ఈమేరకు అసంతృప్తి నేతలను కలుపుకొని మండలాల వారీగా నమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో కొందరు అవసరమైతే పార్టీని వీడేందుకు సిద్ధమన్న సంకేతాలు పంపిస్తున్నారు.
ప్రశ్నార్థకంగా సోలిపేట ఫ్యామిలీ పరిస్థితి
దుబ్బాక నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దివంగత సోలిపేట రామలింగారెడ్డి కుటుంబం పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. రామలింగారెడ్డి భార్య సుజాత, కొడుకు సతీశ్ రెడ్డి తమ అనుచర వర్గంతో కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా తమకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదనే అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తోంది. అయినప్పటికీ తమ వర్గాన్ని కాపాడుకునేందుకు నియోజకవర్గం వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. రామలింగారెడ్డి పార్టీకి, దుబ్బాకకు ఎంతో చేశారని, తమ కుటుంబానికే టికెట్ ఇవ్వాలని వారు కోరుతున్నారు. మరోవైపు రాయపోల్ మండలానికి చెందిన మామిడి మోహన్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే స్వచ్ఛంద సంస్థ తరపున నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.