హైదరాబాద్ : మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ప్రభాకర్ రెడ్డికి మెరుగైన చికిత్స అందించేందుకు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రభాకర్ రెడ్డికి కత్తిపోటుతో కడుపులో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ట్రీట్ మెంట్ మొదలుపెట్టారు డాక్టర్లు.
2023, అక్టోబర్ 30వ తేదీ మధ్యాహ్నం.. కొత్త ప్రభాకర్ రెడ్డి సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమయంలో రాజు అనే వ్యక్తి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు వచ్చి కత్తితో డాడి చేశాడు. దీంతో ప్రభాకర్ రెడ్డి పొట్టభాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో ప్రచారంలో చుట్టూ చాలా మంది ఉన్నారు. వాళ్లందరినీ తోపుకుంటూ.. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో హత్యాయత్నం చేశాడు.
ఈ విషయాన్ని వెంటనే గమనించిన సెక్యూరిటీ గార్డులు, బీఆర్ఎస్ కార్యకర్తలు అతన్ని అడ్డుకున్నారు. నిందితుడిని చితకబాదారు. వెంటనే పోలీసులకు అప్పగించారు. నిందితుడు మిడిదొడ్డి మండలం పెద్ద చెప్యాల గ్రామానికి చెందిన రాజుగా గుర్తించారు. అతను ఓ యూ ట్యూబ్ చానల్ లో పని చేస్తున్న విలేకరిగా తెలుస్తోంది. ప్రస్తుతం రాజు పోలీస్ కస్టడీలో ఉన్నాడు.
కత్తితో పొట్టపై గాయం తీవ్రత ఎంత అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. దాడి తర్వాత ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి.. పొట్టపై తన చేతిని బలంగా అదిమి ఉంచటం విజువల్స్ తో స్పష్టంగా కనిపిస్తుంది. దాడి తర్వాత ఏ మాత్రం ఆలస్యం కాకుండా.. నిమిషాల వ్యవధిలోనే ఆయన్ను గజ్వేల్ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్యశోద ఆస్పత్రికి తీసుకొచ్చారు.
ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు : హరీష్రావు
కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ప్రభాకర్ రెడ్డిపై దాడి అత్యంత గర్హనీయం అన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని, ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వంతో పాటు బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందన్నారు.
ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ కేడర్ ఎలాంటి ఆందోళనలకు గురికావొద్దని, అధైర్య పడవద్దని, ప్రభాకర్ రెడ్డిని కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు మంత్రి హరీష్రావు. ప్రభాకర్ రెడ్డి హత్యాయత్నం కేసులో రాజకీయ కుట్ర ఏదైనా ఉందా అనే కోణంలో సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని చెప్పారు.