దుబ్బాక తీర్పు.. తెస్తది మార్పు!

దుబ్బాక తీర్పు.. తెస్తది మార్పు!

దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ప్రజల ఆలోచనల్లో మార్పుకు స్పష్టమైన సంకేతం. ఎవరినైనా కొంతకాలం మోసం చేయవచ్చు. కానీ ఎల్లకాలం మోసం చేయలేరనేది సత్యం. టీఆర్ఎస్ నాయకులకు దుబ్బాక జనం తమ ఓటుతో ఈ విషయాన్ని చాటి చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంపై ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రంలో అధికారం ఇచ్చి కూర్చోబెట్టిన సీఎం కేసీఆర్.. ఆ మూడు విషయాల్లోనూ చేసిందేమీ లేదు. ఉద్యమ నాయకత్వం వహించిన మనిషన్న నమ్మకంతో పదవి కట్టబెట్టిన ప్రజల ఆశలన్నీ వమ్ము చేశారు. అన్ని రంగాల్లో ప్రభుత్వం ఫెయిల్ అవుతున్నా.. ప్రజలు ఎప్పటికీ తమకే ఓట్లేస్తారన్న ధీమాతో ఉన్న ఆ పార్టీకి జనం సరైన సమాధానం చెప్పారు. ఇది రాష్ట్ర ప్రజల్లో వస్తున్న మార్పుగానే చూడాలి. టీఆర్ఎస్ ఇకనైనా కళ్లు తెరవాలి. మాటలతో మాయ చేయొచ్చనుకుంటే ఆ పార్టీని ముందు ముందు వచ్చే ఎన్నికల్లో పూర్తిగా ఇంటికి పంపడం ఖాయమని తెలుసుకోవాలి.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ యువతకు ఉద్యోగాల్లో అన్యాయం జరిగిందని, మన నీళ్లు మనకు కావాలని, మన నిధులు మనకే ఖర్చవ్వాలనే న్యాయమైన కోర్కెలతో తెలంగాణ ఉద్యమం పుట్టింది. దశాబ్దాల పాటు సాగిన పోరాటంలో ఎందరో ఎన్నో త్యాగాలు చేశారు. కొందరు నాయకులు అవకాశవాద రాజకీయాలు చేసినప్పటికీ.. యువకుల ప్రాణత్యాగాలు, ఉద్యోగుల ఉద్యమాలు, ప్రజల తిరుగుబాటు ఫలితంగా ప్రత్యేక తెలంగాణ ఏర్పడింది. రాష్ట్ర సాధన ఉద్యమానికి నాయకత్వం వహించారని, తెలంగాణ సమస్యలు తెలిసిన వ్యక్తిగా ప్రజల కష్టాలు తీరుస్తారని ఎంతో విశ్వాసంతో ప్రజలు టీఆర్ఎస్ కు అధికారం కట్టబెట్టారు.

ఉద్యమ ఆకాంక్షలు తీర్చలే..

పదవిలోకి వచ్చాక మొట్టమొదట చేయాల్సింది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన. 2014 నాటికే లక్షన్నర ఉద్యోగాలు ఖాళీగా ఉన్నయ్. తరువాత చాలామంది రిటైర్ అయ్యారు. ప్రభుత్వం దీక్షగా ఉద్యోగాల భర్తీ చేసినట్లయితే తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష కొంతవరకైనా నెరవేరేది, నిరుద్యోగుల బాధలు కొంత తీరేవి. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి తీసుకోవాల్సిన చర్యలు తీసుకోలేదు. ఇక ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడం. ఈ పనిని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో కారణం చెబుతూ పక్కన పెడుతూ వస్తోంది.

రైతులు ఆగమైతున్నరు

గతంలో రైతులు ఎదుర్కొన్న సమస్యలు తీర్చాల్సిన ప్రభుత్వం ఆ పనీ చేయలేదు. ముఖ్యంగా కౌలు రైతుల సమస్యలు తీర్చాల్సిన ప్రభుత్వం పూర్తిగా కౌలురైతు వ్యతిరేక వైఖరిలో నడుస్తోంది. దీని వల్ల ప్రభుత్వ పథకాలతో కౌలురైతుకు ఎటువంటి మేలు జరగలేదు. మరోవైపు వాస్తవ సాగుదారు వివరాలు పహానీలలో నమోదు చేయకపోవడం వల్ల ఎప్పుడో భూములను అమ్ముకున్న పట్టాదారులు, వారి వారసులు మళ్లీ తామే పట్టేదారులమని రైతుబంధు లబ్ధిపొంది, వాస్తవంగా సాగుచేసే వారిని ఇబ్బంది పెడ్తున్నరు. రెవెన్యూ అధికారుల అవినీతి వల్ల రైతాంగం చాలా కష్టపడుతున్నరు. రైతులకు గిట్టుబాటు ధర దొరకడంలేదు. ఆత్మహత్యలు ఆగలేదు. ఇక ప్రాజెక్టుల విషయంలో చిన్నచిన్న ప్రాజెక్టులను పూర్తి చేసి, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు పొందే విధంగా రూపొందించాల్సింది. కాని కేసీఆర్ ఏమి చేశారో అందరికీ తెలుసు. ప్రజల డబ్బును ఎలా సద్వినియోగ పరచాలన్న ఆలోచన కూడా లేదు. అవినీతి లేకుండా తక్కువ ఖర్చుతో ఎలా పనులు, పాలన చేయాలో ఆలోచించలేదు. దీనివల్ల బడ్జెట్ అంతా భారీగా పెరిగిపోతున్నది. పైగా మన రాష్ట్రంలో ఇప్పుడు కొత్త సెక్రటేరియట్ నిర్మాణం అవసరమా అన్నది కూడా అందరినీ ఆలోచింపజేస్తోంది. హైదరాబాద్ లో మొన్నటి వర్షాల వల్ల ఎన్నో కాలనీలు మునిగిపోయాయి. చెరువులు, డ్రైనేజీలు ఆక్రమణకు గురికావడమే కారణం. అక్రమ కట్టడాలు రాకుండా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ విఫలమైన విషయంపై సామాన్యులు కూడా ప్రశ్నిస్తున్నారు.

విద్య, వైద్యం.. అన్నీ గాలికొదిలేసిన్రు

విద్యా రంగాన్ని ప్రభుత్వం పూర్తిగా వదిలేసింది. ఉస్మానియా, కాకతీయ వర్సిటీల సమస్యలు కనీసం పరిశీలించే స్థితి కూడాలేదు. ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ చేయలేదు. ప్రభుత్వ విద్యాసంస్థలను నిర్వీర్యం చేసి ప్రైవేట్ యూనివర్సిటీలను అభివృద్ధి చేస్తున్నారు. ప్రభుత్వ తీరు వల్ల విద్య పేదవారికి అందకుండా పోతున్నది. కేజీ టూ పీజీ ఉచిత విద్య అన్న హామీ ఎటుపోయిందో తెలియదు. పేదోడికి చదువు కాస్ట్లీ అయిపోయింది. ఎస్సీ, ఎస్టీలు, ఈబీసీలు, ముస్లింలకు ఉన్న రిజర్వేషన్లను విద్య, ఉద్యోగాల్లో సక్రమంగా అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.  వైద్యపరంగానూ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. నిమ్స్, ఉస్మానియా, గాంధీ లాంటి ఆసుపత్రుల్లో డాక్టర్ల పోస్టులు భర్తీ చేయలేదు. కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న ఆసుపత్రుల్లోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను, మున్సిపల్ కార్మికుల ఉద్యోగాలను రెగ్యులర్ చేయలేదు. వారికి చెల్లించాల్సిన జీతాలు, బకాయిలు సకాలంలో చెల్లించలేదు.

ఇలా ఒక్కటేమిటి అన్ని రంగాల్లో వైఫల్యాలను ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ యాసలో, భాషలో మాట్లాడిన ప్రభుత్వం చేస్తున్న పనులను, వస్తున్న ఫలితాలను ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు ఎప్పుడూ మాటలకే పడిపోతారని అనుకుంటే పొరబాటే. కాంగ్రెస్ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగలేక పోతున్నది. అందుకే దుబ్బాకలో బీజేపీ విజయం సాధించింది. కొంతమంది అనుకుంటున్నట్లు హరీశ్ రావుకు టీఆర్ఎస్ నేతలు కావాలనే సహకారం అందించకుండా అతన్ని బలహీన పరచాలని చూశారన్నది నిజమైతే.. ఇది టీఆర్ఎస్ కు ఆత్మహత్య సదృశ్యమే. ఏది ఏమైనా ఇకనైనా టీఆర్ఎస్ కళ్లు తెరవకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ ని ఇంటి బాట పట్టించడం తథ్యం. దుబ్బాక ఎన్నికల్లో వచ్చిన మార్పు… రాష్ట్రం మొత్తాన్ని ఆలోచింపచేస్తోంది. టీఆర్ఎస్ ఇచ్చిన హామీల అమలు తీరు, ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజలు సీరియస్ గా తీసుకుని.. రేపటి రోజున మార్పు దిశగా అడుగేస్తరని గుర్తెరగాలి.

– జస్టిస్ బి. చంద్రకుమార్, హైకోర్టు రిటైర్డ్​ జడ్జి

For More News..

సింగరేణి కరోనా వారియర్​ ఫ్యామిలీకి రూ.50 లక్షలు

ఐపీఎల్‌లో కొత్త ఫ్రాంచైజీ!

మా నేతల ఫోన్లు ట్యాపింగ్​ చేస్తున్నరు