మల్లన్న సాగర్​ ప్రాజెక్ట్​ కాల్వ పనులు పూర్తి చేయాలి

దుబ్బాక, వెలుగు: మల్లన్న సాగర్​ ప్రాజెక్ట్​ ప్రధాన కాల్వకు అనుసంధానంగా నిర్మిస్తోన్న 4 ఎల్ డిస్ర్టిబ్యూటరీ​ కాల్వ పనులను పున:రుద్ధరించాలని డిమాండ్​ చేస్తూ బుధవారం దుబ్బాక పట్టణ పరిధిలోని ముస్తాబాద్​​ రోడ్డుపై రైతులు బైఠాయించి ధర్నా చేపట్టారు. మండల పరిధిలోని కమ్మర్​పల్లి, చీకోడు, అచ్చుమాయపల్లి, పోతారం, శిలాజీనగర్​, పట్టణ పరిధిలోని మల్లాయపల్లి, చెల్లాపూర్​ గ్రామాల రైతులు భారీ ఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చీకోడు మాజీ ఎంపీటీసీ ఎల్​. రాంరెడ్డి మాట్లాడుతూ మండల రైతుల బాగుకోసం గత ప్రభుత్వం 4 ఎల్​ కాల్వ పనులను ఐదేళ్ల కింద ప్రారంభించిందని, ఏడాది కాలంగా పనులు నత్తనడకన సాగాయని, పనులను బందు చేసి ఇటీవల సంబంధిత కాంట్రాక్టర్ మిషనరీని తీసుకెళ్లారని ఆరోపించారు. 

బల్వంతాపూర్​ గ్రామం నుంచి అప్పర్​ మానేర్​ డ్యామ్​ వరకు 14.5 కిలో మీటర్ల మేర 4 ఎల్​ డిస్ర్టిబ్యూటరీ కాల్వను నిర్మిస్తున్నారని, కాల్వ నిర్మాణం కోసం బల్వంతాపూర్​, చెల్లాపూర్​, దుబ్బాక, మల్లాయపల్లి, కమ్మర్​పల్లి, చీకోడు, అచ్చుమాయపల్లి, పోతారం, గంభీర్​పూర్​, శిలాజీనగర్​ గ్రామాల రైతులు వందల ఎకరాలను ఇచ్చారని, కొంత మంది రైతులకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం అందకున్నా   నీరొస్తే   పంటలు సాగు చేసుకోవచ్చనే ఆశతో ఉన్నారని, కాంట్రాక్టర్​ నిర్లక్ష్యంతో రైతుల ఆశలను ఆడియాసలను చేశారని ఆరోపించారు. కాల్వ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు పూర్తి స్థాయి పరిహారం అందించాలని డిమాండ్​ చేశారు.

కాల్వ పూర్తయితే మల్లన్న సాగర్​ నీటితో వందల చెరువులు, కుంటలు నిండి వేలాది ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉందన్నారు. రైతుల్లో ఆనందం చూడడానికి స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్​ రెడ్డి కాల్వ నిర్మాణం కోసం శాయశక్తుల కృషి చేస్తున్నారని తెలిపారు. కాల్వ పనులను మధ్యలోనే విడిచిపెట్టి పోయిన కాంట్రాక్టర్​పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పెండింగ్​లో ఉన్న కాల్వ పనులను పూర్తి చేసి రైతులకు సాగు నీరందించాలని డిమాండ్​ చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను పోలీసులు సముదాయించి ఆందోళనను విరమింపజేశారు. ​ ఈనిరసన కార్యక్రమంలో రైతులు కరికె రాంచంద్రం, చల్ల నారాయణ రెడ్డి, పర్శ యాదగిరి, ఎల్లం, స్వామి, మహేందర్​ రెడ్డి, బాలయ్య పాల్గొన్నారు.