దుబ్బాక రైతులు సాగునీరు ఇవ్వాలని తహసీల్దార్ కు వినతి

దుబ్బాక రైతులు సాగునీరు ఇవ్వాలని తహసీల్దార్ కు వినతి

దుబ్బాక, వెలుగు: మల్లన్న సాగర్​ ప్రాజెక్ట్​ ద్వారా సాగు నీటిని ఇవ్వాలని కోరుతూ సోమవారం దుబ్బాక పట్టణ రైతు కమిటీ ఆధ్వర్యంలో రైతులు తహసీల్దార్‌‌కు వినతిపత్రం అందజేశారు. కమిటీ అధ్యక్షుడు  చెక్కపల్లి రాజమల్లు మాట్లాడుతూ..  మల్లన్న సాగర్ నీరు 4 ఎల్​ డిస్ర్టిబ్యూటరీ కాల్వ ద్వారా మండలంలోని కొన్ని గ్రామాలకే వస్తున్నాయని పట్టణ పరిధిలోని సాగు భూములకు, చెరువు, కుంటలకు రావడం లేదని తెలిపారు.  

దుబ్బాక కన్నతల్లిగా పిలుచుకునే పెద్ద చెరువుకు మల్లన్నసాగర్​ నుంచి చుక్క నీరు రావడం లేదని ఫలితంగా1500 ఎకరాలు బీడు భూములుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు.  పట్టణ పరిధిలోని 1523, 99 సర్వే నెంబర్లలోని భూముల్లో 700  ఫీట్ల వరకు బోరు బావులను తవ్వినా చుక్క నీరు రావడం లేదన్నారు. బోరు బావుల కోసం చేసిన అప్పులు తీర్చలేక రైతులు కుటుంబాలను విడిచి పెట్టి గల్ఫ్​ దేశాల బాట పట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

మండుతున్న ఎండలతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయని, బోరు బావుల్లో చుక్క నీరు లేక చేతికొచ్చిన వరి పంట ఎండిపోవడంతో రైతులకు కన్నీరే మిగులుతుందన్నారు. పట్టణ పరిధిలోని సాగు భూముల్లోకి మల్లన్న సాగర్​ నీటిని వదిలి రైతులకు ఆదుకోవాలని మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, ఎమ్మెల్యే, ఎంపీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. రైతులు రాంచంద్రం, జోగయ్య, యాదగిరి, రాములు, లింగయ్య, భద్రి, ఎల్లం, రాజయ్య, బాబు, ప్రవీణ్​, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.