
దుబ్బాక, వెలుగు : దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి రజకులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. శుక్రవారం దుబ్బాకలో జరిగిన మెదక్ లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు చదువుకున్నా.. ఆయన కంటే చదువురాని సాకలోళ్లు నయం’ అని అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడిన వీడియో క్లిప్పింగులు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో ఆయనపై ఇంట, బయట దుమారం రేగుతోంది. దీంతో ఎమ్మెల్యే దిద్దుబాటు చర్యలకు దిగారు.
తనకు రజకులపట్ల అపార గౌరవం ఉందని, వారి అభ్యున్నతికి గత బీఆర్ఎస్ప్రభుత్వం అనేక అభివృద్ధి పథకాలను అమలు చేసిందని, చాకలి ఐలమ్మ విగ్రహాలు ఊరూరా ఏర్పాటుచేశామన్నారు. అనాదిగా వస్తున్న సామెతను మాత్రమే తాను చెప్పాను తప్ప తనకు ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు చేస్తున్న విష ప్రచారాన్ని పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు.