హైదరాబాద్: రాష్ట్రంలో కార్పోరేట్ కాలేజీలు పెరిగిపోయాయని, అనుమతి లేని భవనాలలో నారాయణ, చైతన్య కాలేజీలు తమ కార్యకలాపాలు నడుపుతున్నాయని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఆదివారం ఓయూలో తెలంగాణలో కార్పొరేట్ సంస్థల విద్యా విధ్వంసం- అధ్యాపకుల ఆత్మగౌరవం అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఎమ్మెల్యే తోపాటు, బిసి నేత ఆర్. కృష్ణయ్య హాజరయ్యారు.
సమావేశంలో టీఎల్ఎఫ్ గౌరవ అధ్యక్షుడు, సభాధ్యక్షుడు మురళి మనోహర్ మాట్లాడుతూ.. చైతన్య, నారాయణ కాలేజీల లీలలు మాములుగా లేవని, స్టూడెంట్స్ అడ్మిషన్లు బట్టే ఉపాధ్యాయులను భర్తీ చేస్తామని డ్రామాలడుతున్నారన్నారు. అడ్మిషన్లు, కలెక్షన్లు అయిపోయినా కూడా ఉపాధ్యాయులను మాత్రం తీసుకోవడం లేదని, కొంతమందిని తీసుకున్నా.. శీల పరీక్ష తప్ప అన్ని రకాల పరీక్షలు పెట్టిన తర్వాతే తీసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ప్రయివేట్ అధ్యాపకులు భయంలో బతుకుతున్నారని, 16 ఏళ్ళు సర్వీస్ ఇచ్చిన ఉపాద్యాయులకు సైతం 16 సెకన్ల ఉద్యోగ భద్రత లేదని అన్నారు. కార్పొరేట్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్ధులు ఒత్తిడి తట్టుకోలేక చాలామంది చనిపోతున్నారు….కానీ ఉద్యమాలు మాత్రం జరగడం లేదని, చనిపోయిన కుటుంబాలకు డబ్బులు ముట్టడంతోనే ఉద్యమాలు చేయడం లేదన్నారు. ర్యాంకుల పేరుతో బ్రాండింగ్ క్రియేట్ చేసి తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు . రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్పొరేట్ కాలేజీలకు కొమ్ముకాస్తుందన్న మురళీ మనోహర్.. ఒక్క కాలేజి పేరుతో వందల కాలేజిలు పెడుతున్న ఆ కార్పేరేట్ సంస్థలను అరికట్టేందుకు చట్టం తేవాలన్నారు. రాష్ట్ర సర్కారు కు విద్య చివరి ప్రియారిటీ అని, పిల్లలు చదివి చేసేదేం లేదనే భావనలో ముఖ్యమంత్రి ఉన్నారన్నారు.
కార్పొరేట్ కాలేజీలు ఎంతమందికి పీఎఫ్, ఈఎస్ఐలు చెల్లిస్తున్నాయో తెలుసుకునేందుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కి లేఖలు రాయాలని సమావేశంలో పాల్గొన్న అధ్యాపకులకు సూచించారు ఎమ్మెల్యే రఘునందన్. కాలేజీల ఫిజుల వసూలు, పీఎఫ్, ఈఎస్ఐ చెల్లింపులపై ఆర్టిఐ తో సమాచారం సేకరించాలన్నారు. ఈ సమాచారంతో ప్రతిరోజూ న్యాయమూర్తికి లేఖలు రాయాలని, ఏదో ఒకరోజు ఆయన స్పందిస్తాడని అన్నారు . మూస విధానాలు మాని, కొంత పంథాలో ఉద్యమాలు చేయాలని, బేషజాలకు పోకుండా అందరికి కలుపుకొని ఉద్యమాన్ని తీసుకెళ్లాలని అన్నారు.
హరనాథ్ అనే అధ్యాపకుడు ఓ కార్పోరేట్ కాలేజీ జీతాలివ్వకపోవడంతో ఆత్మహత్యయత్నం చేస్తే ఆయన మీదే కేసు పెట్టారు తప్ప, జీతాలు ఇవ్వకుండా ఆత్మహత్యకు పాల్పడేలా ప్రోద్బలంచేసిన ఆ కాలేజీలపై కేసులు పెట్టలేదని అన్నారు రఘునందన్. అహంకారంతో విర్రవీగే కేసీఆర్ కు బుద్ధిచెప్పాలనే దుబ్బాక ప్రజలు తనను గెలిపించారని , కేసీఆర్ కోటనే కొట్టగలిగినప్పుడు నారాయణ, చైతన్య లను కొట్టుడు ఒక లెక్కేకాదని అన్నారు. పోరాడితే పోయేదేం ఉండదని, తాను చనిపోతే తన శరీరాన్ని ఏదైనా హాస్పిటల్ కి ఇవ్వమని తన బిడ్డకు చెప్పానని రఘునందన్ అన్నారు.