కార్యకర్తలే బీజేపీకి కొండంత బలం : రఘునందన్​రావు

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: కార్యకర్తలే బీజేపీకి కొండంత బలమని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు చెప్పారు. మంగళవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2023లో అధికారం చేపట్టే దిశగా కార్యకర్తలు పనిచేయాలన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని కోటి మంది తాగుబోతుల తెలంగాణగా మార్చిండన్నారు. నిరుద్యోగభృతి ఊసెత్తని కేసీఆర్ ను వచ్చే ఎన్నికల్లో బొందపెట్టాలన్నారు. రూ.25 కోట్లతో నిర్మించిన బస్టాండ్ 3 నెలలు తిరగకుండానే కురుస్తున్న సంగతి మంత్రి పువ్వాడ అజయ్ కి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఎర్రజెండా పార్టీలను సీఎం కేసీఆర్​గతంలో సూది, దబ్బనం పార్టీలన్నారని గుర్తుచేసిన రఘునందన్, వాటిని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. గిరిజనులకు పట్టాలిప్పిస్తానని చెప్పి కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్​లో చేరిన ఓ ఎమ్మెల్యే పట్టాలిప్పిచ్చారా అని ప్రశ్నించారు.

ఆయన చేసిన కామెంట్స్​వల్లే నేడు నిబద్ధత కలిగిన అటవీ అధికారిని కోల్పోవాల్సి వచ్చిందన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్​రెడ్డి, బీజేపీ ఖమ్మం పార్లమెంటరీ ఇన్​చార్జ్ దేవకీ వాసుదేవరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రుద్రప్రదీప్ కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అలాగే రఘునాథపాలెం మండలం ఈర్లపూడికి వెళ్లి, ఇటీవల గొత్తికోయల దాడిలో చనిపోయిన ఎఫ్ఆర్ఓ చలమల శ్రీనివాసరావు కుటుంబాన్ని రఘునందన్​పరామర్శించారు. ఆఫీసర్​హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పారు. చత్తీస్ గఢ్ నుంచి వచ్చిన వాళ్లు తెలంగాణలో ఉండొద్దు అంటూ మంత్రులే చెబుతుండడం దారుణం అన్నారు. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే ‘సివిల్​వార్’కి దారితీసే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డిసెంబర్ లో పోడు భూములకు పట్టాలిచ్చి, గిరిజనులకు, అధికారులకు రక్షణ కల్పించాలని కోరారు.