- ఓపిక లేక కేసీఆర్ దూషణలకు దిగడం దురదృష్టకరం
- ప్రకృతి వల్ల వచ్చిన కరువును రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటని ఫైర్
- గోదావరిఖనిలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సమావేశంలో మంత్రి
గోదావరిఖని, వెలుగు: కాంగ్రెస్ పార్టీ గెలుపుతోనే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించేలా ప్రతి కార్యకర్త అంకితభావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. గోదావరిఖని దుర్గానగర్‌లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సోమవారం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.
రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అధ్యక్షతన జరి గిన ఈ సమావేశానికి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమిష్టి కృషి ఫలితంగానే అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించగలిగామని ప్రకటించారు. రాజకీయ అనుభవమున్న కేసీఆర్ ఓపిక లేకుండా దూషణలకు దిగుతున్నారని విమర్శించారు. ప్రకృతి వైపరీత్యం వల్ల వచ్చిన కరువును కూడా బీఆర్ఎస్ లీడర్లు రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటన్నారు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలు 40 కోట్ల ఫ్రీ ట్రిప్పులు తిరిగారని, రూ.500కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ చూసి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఓర్వలేకపోతున్నారని అన్నారు.
రామగుండం అభివృద్ధికి సంపూర్ణ సహకారం
పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను గెలిపిస్తే రామ గుండం అభివృద్ధికి తమ సంపూర్ణ సహకారం ఉంటుందని మంత్రి శ్రీధర్‌బాబు భరోసా ఇచ్చారు. రామగుండం ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్‌గా మార్చేందుకు సహకరిస్తామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిలో కాంట్రాక్టు వ్యవస్థను నాశనం చేసిందని, అసలు కాంట్రాక్టు కార్మికులే లేరని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంట్రాక్టు కార్మికులకు వేతనాల పంపిణీ, గుర్తింపు ఇచ్చే తదితర అంశాల గురించి మినిమమ్ వేజ్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ బీ జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో కూలంకషంగా చర్చించి, నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రామగుండం నియోజకవర్గ పరిధిలో పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్‌ను, పెద్దపల్లి ప్రాంతంలో పత్తిపాక ప్రాజెక్టును పూర్తి చేయకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని మంత్రి శ్రీధర్ బాబు చాలెంజ్ చేశారు. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించి పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీ కృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు మార్గదర్శనం చేశారు.
ఉపాధి అవకాశాలు కల్పిస్తా: గడ్డం వంశీకృష్ణ
ఈ ఎన్నికల్లో ప్రజలు తనను ఆదరించి గెలిపిస్తే స్థానిక సమస్యల పరిష్కారంతోపాటు ప్రధానంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తానని కాంగ్రెస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తెలిపారు. పేద ప్రజల సం క్షేమం కోసం అహర్నిశలు తపించిన కాకా మనమడిగా.. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ.. ఈ ప్రాం త ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని అన్నారు. తన తాత కాకా.. కేంద్ర మంత్రిగా కార్మికుల కోసం పెన్షన్ సౌకర్యం తీసుకువచ్చారని, సింగరేణి నష్టాల్లో ఉన్నప్పుడు రూ.450 కోట్ల మారటోరియమ్ ఇప్పించి ఆ సంస్థను ఆదుకున్నారని వంశీకృష్ణ గుర్తు చేశారు. ప్రభుత్వ సలహదారులు హర్కర వేణుగోపాల్‌రావు, ఎన్టీపీసీ ఎన్బీసీ మెంబర్ బాబర్ సలీంపాష, మినిమమ్ వేజ్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ బీ జనక్ ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బీ వెంకట్రావు, ఇతర లీడర్లు మాట్లాడారు.
ఆ పార్టీలకు బుద్ధి చెప్పాలి: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటేనని, ప్రజల ను మోసం చేయడానికి ఒక్కటై వస్తున్న ఈ రెండు పార్టీలకు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలంతా తగిన గుణపాఠం చెప్పాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో రామగుండానికి పూర్వ వైభవం తీసుకువస్తామని తెలిపారు. స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు విద్యుత్ పరిశ్రమలు నెలకొల్పుతామని వెల్లడించారు.
బీఆర్ఎస్లో మిగిలేది ఆ ముగ్గురే: ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు
మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో గడ్డం వంశీకృష్ణ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందబోతున్నారని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ధీమా వ్యక్తంచేశారు. సింగరేణి కార్మికుల సమస్యలను ప్రభుత్వ పరంగా పరిష్కరిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ఉనికి కోల్పోతున్న బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దింది కాంగ్రెస్సే: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
దేశ ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పుడు 1992లో మన్మోహన్ సింగ్ ఆర్ధిక శాఖ మంత్రిగా తీసుకువచ్చిన రిఫార్మ్స్‌తో దేశాన్ని కాపాడింది కాంగ్రెస్ పార్టేనని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ మూత పడిన సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌తో మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి మాట్లాడారని, ఆ తర్వాత పెద్దపల్లి ఎంపీగా తాను కూడా ప్రధానితో చర్చించి ప్రణబ్‌ముఖర్జీ అధ్యక్షతన పార్లమెంటరీ సబ్ కమిటీలో రూ.10 వేల కోట్ల రుణాన్ని మాఫీ చేయించినట్టు చెప్పారు.
దీంతో బీఐఎఫ్ఆర్ జాబితా నుంచి ఎఫ్‌సీఐ బయటపడటంతో నేడు మళ్లీ రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ సంస్థగా ప్రారంభమైందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని చాలామంది బీఆర్ఎస్ లీడర్లు ఆ పార్టీకి రాజీనామాలు చేసి హస్తం గూటికి చేరుతున్నారని తెలిపారు. కాళేశ్వరం, మిషన్ భగీరథలో కుంభకోణం జరిగితే సోదాలు చేయని ఈడీతో కక్షపూరితంగా ఎన్నికల సమయంలో తమపై దాడులు చేయించారని మండిపడ్డారు. వంశీకృష్ణను పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని కోరారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.
తెలంగాణ ఏర్పాటు కోసం కాకా' కృషి: ఎమ్మెల్యే గడ్డం వినోద్
కాకా వెంకటస్వామి ఆశీర్వాదంతో, ప్రజల ఆశీస్సులతో తాను రాజకీయంలోకి వచ్చానని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కోసం వెంకటస్వామి ఎంతగానో కృషి చేశారని గుర్తుచేశారు. చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేయాలన్నదే కాకా తాపత్రయం అని, ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్న మనుమడు, పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాగాంధీదని, వంశీకృష్ణను గెలిపించి ఆమెకు బహుమతిగా ఇవ్వాలని అన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజల కండ్లల్లో కారం కొట్టి రూ.45 వేల కోట్లు దోచుకున్నదని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు.
రైతులపై కేసీఆర్‌ది కపట ప్రేమ: ఎమ్మెల్యే విజయరమణారావు
కేసీఆర్ రైతులపై కపట ప్రేమ చూపిస్తు న్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు మండిపడ్డారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దొంగ దీక్షలతో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. మంత్రిగా కొనసాగిన కొప్పుల ఈశ్వర్ ఈ ప్రాంతాలకు తలాపున గోదావరి నది పారుతున్నా కనీసం సాగునీరు కూడా అందంచలేకపోయారని దుయ్యబట్టారు. ఆయనకు ఓట్లడిగే అర్హత లేదని అన్నారు. గడ్డం వంశీకృష్ణ రెండు లక్షల ఓట్ల మెజార్టీతో పెద్దపల్లి ఎంపీగా గెలువబోతున్నారని చెప్పారు.