జగిత్యాల, వెలుగు: జగిత్యాల నియోజకవర్గంలో జీవన్ రెడ్డి ఓటమి నిజంగా దురదృష్టకరమని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. జగిత్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో మంత్రి శ్రీధర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓటమి చెందిన జీవన్ రెడ్డి స్థానంలో తానుంటే ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేయకపోయే వాడినేమోనన్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో జీవన్‌రెడ్డిలాగా 24 గంటలు పనిచేసే వ్యక్తి లేరన్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో కట్టే కుర్చీలే తప్ప మరేమీ ఆశించని ఆయన తనలాంటి వాళ్లకు స్ఫూర్తిదాయకమన్నారు.
కేబినెట్‌లో ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. రాబోయే రోజుల్లో ఆయన సేవలను వినియోగించుకొనే ఆలోచనలో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారనన్నారు. మేనిఫెస్టోలో పెళ్లి కానుకగా రూ.లక్షతోపాటు తులం బంగారం ఆయన ఆలోచనేనని గుర్తు చేసారు. జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తలు అధైర్య పడవద్దని ఓటమి చెందినప్పటికీ ఆయన అందరికంటే శక్తివంతమైన నాయకుడన్నారు.
మంత్రికి ఘన సన్మానం
జిల్లా పర్యటనలో భాగంగా జగిత్యాలకు చేరుకున్న శ్రీధర్‌బాబుకు కాంగ్రెస్ క్యాడర్ ఘన స్వాగతం పలికారు. ధర్మపురిలో ప్రత్యేక పూజలు అనంతరం జగిత్యాల చేరుకున్న మంత్రి శ్రేణులతో కలిసి అన్నపూర్ణ చౌరస్తా వద్ద నుంచి భారీ ర్యాలీతో కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఆయన వెంట ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెంట ఉన్నారు. ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్, కల్వకుంట్ల సంజయ్.. మంత్రికి పూలబొకే అందించి స్వాగతం పలికారు. అనంతరం పొన్నాల గార్డెన్ లో కార్యకర్తల సమావేశానికి హజరైయ్యారు. అనంతరం కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి బండ శంకర్ గజమాలతో సత్కరించారు.