
- రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం
- స్వామి వివేకానంద జయంతిలో ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు
సికింద్రాబాద్, వెలుగు : వచ్చే ఐదేండ్లలో మానవ వనరుల్లో తెలంగాణ నంబర్ వన్‌గా మారుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. యువతతోనే రాష్ట్రం అభివృద్ధి అవుతుందని తెలిపారు. యువతకు స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇవ్వడానికి ప్రతి జిల్లాలో స్కిల్ సెంటర్లు, స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ రంగంలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడ్తున్నామని వివరించారు. ప్రైవేటు రంగంలోనూ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలు ముమ్మరం చేస్తున్నామన్నారు.
జాతీయ యువజన దినోత్సవం, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు సికింద్రాబాద్ బోట్స్ క్లబ్ వద్ద వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సికింద్రాబాద్ లోని డైరెక్టర్ అండ్ కమిషనర్ యూత్ సర్వీసెస్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వం యువతను పట్టించుకోలేదన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన వారి కోసం స్పెషల్ కోర్సు
అందుబాటులో తీసుకొస్తున్నామని తెలిపారు. జిల్లా కేంద్రాల్లో కూడా జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తామన్నారు. సెట్విన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో ప్రిన్సిపల్ సెక్రటరీ సవ్యసాచి ఘోష్, సెట్విన్ ఎండీ వేణుగోపాల్ పాల్గొన్నారు. జాబ్ మేళాలో 80 కంపెనీలు పాల్గొనగా.. 6,500 మంది యువత రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.