ఆదివారం ఆగమాగం: చికెన్ తినేందుకు భయపడుతున్న జనం

ఆదివారం ఆగమాగం: చికెన్ తినేందుకు భయపడుతున్న జనం
  • చికెన్ తినేందుకు భయం
  • మండుతున్న మటన్ ధర
  • ముక్కలేకుండానే ముద్ద?
  • పప్పు చారు.. పచ్చిపులుసే గతి
  • హోటళ్లలో తగ్గిన బిర్యానీ సేల్స్

హైదరాబాద్: ఆదివారం వచ్చిందంటే చాలు.. ముక్క ఉడకాల్సిందే..! అది గాంధీ జయంతి రోజైనా.. రిపబ్లిక్ డే అయినా ఏదో ఓ రూపంలో చికెన్ తినటం పరిపాటి. చికెన్ సెంటర్లు బంద్ ఉంటే ముందే తెచ్చి పెట్టుకొంటారు. అయితే ఈ ఐతారం పప్పు చారు.. పచ్చిపులుసే గతయ్యేలా ఉంది. ఒక్క హైదరాబాద్ లోనే  ప్రతి రోజూ 10 లక్షల​ కిలోల చికెన్ వినియోగమవుతోంది. ఆదివారమైతే అది కాస్తా 20 లక్షల కిలోల వరకు వెళ్తుంది. ఇటీవల బర్డ్ ఫ్లూ వస్తుందనే  ప్రచారం నేపథ్యంలో ప్రజలు క్రమంగా చికెన్ కు దూరమయ్యారు. కోడికూర తినేందుకు జంకుతున్నారు.

 నవతరం కూడా మటన్ కన్నా చికెనే ఎక్కువ తింటోంది. ఎంత పెద్ద ఫంక్షన్ చేసిన మటన్ తో పాటు చికెన్ మస్ట్ అనే వాతావరణం ఉంటుంది. అయితే బర్డ్ ఫ్లూ నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల నుంచి కోళ్లు రావడం లేదు. దీనికి తోడు ఇక్కడ ఆల్రెడీ ఉన్న కోళ్లు అమ్ముడు పోవడం లేదు. కొనుగోలు దారులు లేక పోవడంతో మొన్నటి వరకు కిలో రూ. 280 పలికిన కిలో చికెన్ ధర కాస్తా రూ. 100కు పడిపోయింది. అయినా కొనేవారు కరువయ్యారు. మటన్ ధర మండిపోతోంది. హైదరాబాద్ లో కిలో రూ. 840 నుంచి రూ. వెయ్యి వరకు పలుకుతోంది. దీంతో దిగువ మధ్యతరగతి ఇప్పటికే మటన్  కు దూరమైంది. దీంతో ఈ ఆదివారం పప్పుచారు భోజనమే గతి అంటున్నారు. 

చికెన్ బిర్యానీ సేల్స్ డౌన్

వీకెండ్స్ లో చిల్ అయ్యేందుకు చాలా మంది రెస్టారెంట్లకు వెళ్తుంటారు. ఎక్కవ మంది చికెన్ బిర్యానీ తినేందుకు ఆసక్తి చూపుతారు. ఇప్పుడు ఆ ప్లేస్ లో వెజ్ బిర్యానీ వచ్చి చేరుతోంది. పన్నీర్ బిర్యానీ తినేందుకు ఆసక్తి చూపుతున్నారు.