పాడిపై వేడి దెబ్బ

రేపల్లెలో శ్రీకృష్ణుడు మురళీగానం వినిపిస్తుంటే, గోవులు మేత మేస్తూ, నీరు తాగుతూ హాయిగా సేదదీరేవి! ఇదొక పుక్కిటి పురాణం! ఇందులో శాస్త్రీయత ఎంత? లోతు తెలుసుకోవడానికి కొందరు శాస్త్రవేత్తలు మన ఉత్తరాది రాష్ట్రాల్లో గోవులు, గేదెలకు ప్రత్యేక షెడ్లలో మురళీగానం వినిపిస్తూ పరిశోధనలు చేస్తున్నారు. ఫలితాలు సానుకూలంగా ఉన్నాయన్నది ప్రాథమిక నివేదిక. ఇది నిజం! కాలుష్యాలతో వచ్చిన వాతావరణ మార్పుల వల్ల అసాధారణంగా పెరిగిన వేడి పాడి పశువుల్ని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నది. దాంతో పాల ఉత్పత్తి రమారమి తగ్గింది. సహజంగానే వేసవిలో పాల ఉత్పత్తి 4–5 శాతం తగ్గుతుంది. అదనంగా దేశంలో మరో 11 శాతం పాల ఉత్పత్తి ఈ సంవత్సరం పడిపోయినట్టు నివేదికలున్నాయి. ఇది, భూతాపోన్నతితో వచ్చిన వాతావరణ మార్పు ప్రతికూల ప్రభావమే! దేశంలో పాల ఉత్పత్తి– డిమాండ్​కు మధ్య తీవ్ర వ్యత్యాసం ఉంది. ఉత్పత్తి పడిపోవడం సమస్యను మరింత జటిలం చేస్తున్నది. ఇదే వాతావరణ మార్పు వల్ల అతివృష్టి–అనావృష్టి వంటి సమస్యలు పశుగ్రాసం కొరతను సృష్టించి, పాల ఉత్పత్తి వ్యయాన్ని పెంచాయి. వీటిని అధిగమించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రయోగాలూ జరుగుతున్నాయి. తాపాన్ని పాడి పశువులు తట్టుకునేలా వాటిని చల్లబరిచే చర్యలు, వాటిపై ఒత్తిడి తగ్గించే ఉపశమన చర్యలపై డెయిరీ నిర్వాహకులు దృష్టి సారిస్తున్నారు. ఎక్కువ పోషకాలతో కూడిన నాణ్యమైన పశుగ్రాసాన్ని తక్కువ విస్తీర్ణంలో పండించేందుకు కూడా శాస్త్రీయ పరిశోధనలు జరుగుతున్నాయి.  ప్రపంచంలోనే అత్యధిక పాలు ఉత్పత్తి చేసే మన దేశంలో ఏటా 20 కోట్ల టన్నుల పాలు, 8 కోట్ల మంది రైతుల నుంచి సమీకరిస్తున్నారు. ఇంత పెద్ద పాడి పరిశ్రమకు వాతావరణ మార్పుతో పెద్ద చిక్కే వచ్చి పడింది.

మూలిగే నక్కపై తాటిపండు

పాలతో పాటు పెరుగు, జున్ను, వెన్న, నెయ్యి, క్రీమ్, పన్నీర్, కోవా.. ఇలా పలు పాల ఉత్పత్తుల్ని దేశంలో వినియోగిస్తారు. ఎగుమతి స్వల్పమే! ఎక్కువ దేశీయంగా వినియోగించినా, మన అవసరాలకు సరిపడా పాడి అందట్లేదు. పశుగ్రాసం కొరత, దాణా లభ్యత తగ్గటం, వాటి ధరలు పెరుగుదల వల్ల పాల ఉత్పత్తి వ్యయం పెరిగింది. పెట్రోలియం ఇంధన ధరల పెరుగుదల ప్రభావం రవాణాపై పడుతోంది. ఈ నెలలోనే సగటున 4 శాతం వరకు పాలసేకరణ ధర పెంచారు. దానికి తోడు వాతావరణ మార్పుల వల్ల తాపం పెరగటంతో ఉత్పత్తి తగ్గటం పరిశ్రమను బాగా దెబ్బతీసింది. ఫలితం, వినియోగదారులకూ కొనుగోలు భారమౌతున్నది. తెలంగాణ రాష్ట్రంలో రోజూ సగటున 45 లక్షల లీటర్ల పాలు కావాల్సి ఉండగా, ఉత్పత్తి 38 లక్షల లీటర్లను మించడం లేదు. దాంతో ఇరుగు పొరుగు రాష్ట్రాల (ప్రధానంగా కర్నాటక) నుంచి రోజూ 7–9 లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రాణాంతక సింథటిక్ పాల వంటి విష రసాయన ఉత్పత్తులూ మార్కెట్లోకి దొంగచాటుగా వస్తున్నాయి. తెలంగాణలో సహకార సంఘాల ద్వారా నడిచే విజయ డెయిరీ, కరీంనగర్ డెయిరీ, మదర్ డెయిరీలకు పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ పరిధిలోని రెండు లక్షల మంది రైతులు పాలు సరఫరా చేస్తున్నారు. వీరితోపాటు 60కి పైగా డెయిరీలు పాలు విక్రయిస్తున్నాయి. మరో 20 లక్షల మంది రైతులు ఒకటీ, రెండు ఆవులో, గేదెలో సాదుకుంటూ ఎక్కడికక్కడ పాలు విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో గేదెలు, ఆవులు కలిపి 37.5 లక్షల వరకుంటాయి. వాతావరణ మార్పు ప్రభావంతో పాటు రకరకాల అంశాలు పాల ఉత్పత్తి తగ్గుదలకు, అంతిమంగా ధర పెరుగుదలకు కారణమవుతున్నాయి.

మునిమాపు తోవదప్పి ...

పాడి పరిశ్రమ సంక్షోభానికి కారణాలెన్ని ఉన్నా చేజేతులా చేసుకున్న తప్పిదాలే ప్రధానం. దేశీ రకం పాడి పశువుల్ని సంరక్షించుకోవడంలో, మెరుగుపరచుకోవడంలో విఫలమయ్యాం అనేకంటే నిర్లక్ష్యం చేశామంటేనే బావుంటుంది. ఒకప్పుడు, వ్యవసాయంలో పాడి భాగంగా ఉండేది. పాడి కన్నా కూడా పశువు పెంట, సాగుకవసరమయ్యే కోడెలు, దున్నపోతుల ఉత్పత్తికి ఆలమందల్ని నిర్వహించేది. ఒకటికొకటి అనుబంధంగా సాగే సమీకృత వ్యవసాయంలో ఆర్థికాంశం కలిసొచ్చేది. తగ్గిపోతున్న పశు సంపద, సాగు విస్తీర్ణం–ఉత్పత్తి–నాణ్యత తగ్గిన పశుగ్రాసం, ధర పెరిగిన దాణా ఇతర ముడి సరుకు, కష్టమౌతున్న నిర్వహణ.. ఇలా అన్నీ సమస్యలే! గ్రామాల్లో సాగుభూమి ఉన్నా, లేకున్నా అప్పట్లో ఇంటికొకటో, రెండో పాడి ఆవు/గేదెలుండేవి. సామూహికంగా మేపడానికి జంగిలి గోజల మందను కొందరు కుర్రాళ్లకప్పగించి నిర్వహించేది. సర్కారు స్థలాలో, బంజర్లో, పడావ్–గైరాన్ భూములో ఉండేవి మందల్ని మేపుకు వచ్చేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రైవేటు(ఫార్మ్) నిర్వహణ అంత తేలిక పనికాదు. ఒకటి రెండు పశువులు ఉండేవారి నిర్వహణా కష్టసాధ్యమే! వాటి తిండికి అంతా కృత్రిమ ఆహారమంటే ఖరీదైన వ్యవహారం! గేదెలైనా,  ఆవులైనా స్థానిక జాతి పశువులు ఎండా, వానా తట్టుకోగలిగే శక్తితో ఉండేవి. వాటిని కాదని, ఎక్కువ పాలిస్తాయనే కారణంతో సంకర జాతి(హైబ్రిడ్) పశువుల్ని అభివృద్ధి చేసుకున్నాం. కొన్ని జాతుల్ని ఐరోపా నుంచి తెచ్చుకున్నారు. ఒకటి, రెండు కాన్పు(ఈత)ల తరువాత పాల దిగుబడి రమారమి తగ్గుతోంది. దేశీ రకమే నయమనిపించే పరిస్థితి. కానీ, వాటి శాతం క్రమంగా తగ్గుతోంది. దాంతో, ఉత్పత్తి శాతం పడిపోతోంది. ‘మునిమాపు తోవదప్పి, తెల్లవార్లూ దేవులాడటం’ అంటే ఇదే! 

సప్లయ్​ చైన్​ మారాలె

పాలు, ఉప ఉత్పత్తుల సరఫరా గొలుసు కూడా సరిగా లేదు. కూరగాయలు, పళ్ల నిర్వహణ లాగే పాల విషయంలోనూ తప్పు జరుగుతోంది. ఎక్కడికక్కడ ఉత్పత్తి చోటే వినియోగం జరిగేలా చూడాలి. అలా కాకుండా గ్రామాల నుంచి పట్టణాలు–నగరాలకు వెళ్లి, అక్కడి నుంచి తిరిగి పట్టణాలు, గ్రామాలకు తెచ్చి పాలప్యాకెట్లుగా అమ్మడం అపసవ్య విధానం. దాని వల్ల పాల ధర పెరిగి, నాణ్యత తగ్గుతుంది. ఉత్పత్తిదారు–వినియగదారు.. ఎవరికీ మేలు జరుగక దళారీల్ని నడిపే వ్యవహారమిది.ఎక్కడి పాల విక్రయం, వినియోగం ప్రాధాన్యతతో అక్కడే జరగాలి. పశువుల సంఖ్య పెరగాలి. స్థానిక బ్రీడ్​ వాటా శాతం పెరిగేలా చూడాలి. పశుగ్రాసం పెంచి, మౌలిక వసతులు మెరుగుపరచాలి. పశువులు జబ్బువాతన పడకుండా నిరంతర వైద్యానికి వెటర్నరీ వ్యవస్థను ఆధునీకరించి, అంతటా అందుబాటులోకి తేవాలి. భారత ఆర్థిక వ్యవస్థకు 5 శాతం వాటాను జత చేస్తున్న పాడి పరిశ్రమాభివృద్ధికి ప్రభుత్వాలు మరింత శ్రద్ధ వహించాలి.

వేడి, ఒత్తిడి తగ్గించే యజ్ఞం!

వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి(యూఎన్) ఏర్పరచిన అంతర్​ప్రభుత్వాల బృందం (ఐపీసీసీ) నివేదిక కూడా అసాధారణ వేడి భారత్​లో వ్యవసాయ, పాడి ఉత్పత్తులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని స్పష్టం చేసింది. ఆహార ఉత్పత్తి 22 శాతం ప్రభావితమయ్యే ప్రమాదాన్ని హెచ్చరించింది. భారత్​లో11 శాతం పాడి ఉత్పత్తి తగ్గడంపై ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక లోతైన ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఆసక్తికరమైన పరిశోధనాంశాల్ని వెల్లడించింది. తాపం వల్ల ప్రత్యక్షంగా, ఒత్తిడి పెరిగి పాల ఉత్పత్తి తగ్గడాన్ని ఎత్తిచూపింది. ఒత్తిడి తగ్గించేందుకు ‘నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్’ (ఎన్డీఆర్ఐ) శాస్త్రవేత్తల పర్యవేక్షణలో హర్యానాలో జరుగుతున్న రకరకాల ప్రయోగాలను వివరించింది. రోజుకు రెండుమార్లు పైపులతో ఒంటిపై నీళ్లు చల్లి, పాడి పశువుల శరీర తాపాన్ని తగ్గించడం, ‘మ్యూజిక్ థెరపీ’ ఇవ్వటాన్ని ఉటంకించింది. మైకులు పెట్టి 40, 50 డెసిబుల్స్ కు మించని స్థాయిలో వేణుగానాన్ని వినిపిస్తున్న షెడ్ దగ్గరికి, ఇతర షెడ్ల నుంచి పాడి పశువులు చేరి సేదతీరడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. సదరు పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గకపోవడాన్ని రికార్డు చేశారు.

- దిలీప్ రెడ్డి.
dileepreddy.r@v6velugu.com