ఎస్సారెస్పీ చివరి ఆయకట్టుకు నీళ్లు రావు

  • యాసంగికి రైతులు ఆరుతడి పంటలే వేసుకోవాలి: ఈఎన్‌‌‌‌సీ శంకర్‌‌‌‌

కరీంనగర్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ పిల్లర్‌‌‌‌ కుంగిన కారణంగా, ప్రాజెక్టు నీటిని వాడుకునే పరిస్థితి లేదని, చివరి ఆయకట్టు రైతులు ఆరుతడి పంటలే వేసుకోవాలని ఎస్సారెస్పీ ఈఎన్‌‌‌‌సీ శంకర్‌‌‌‌ తెలిపారు. 

కరీంనగర్ ఎల్‌‌‌‌ఎండీ కాలనీలోని గెస్ట్‌‌‌‌హౌస్‌‌‌‌లో నీటి విడుదలపై శనివారం ఈఎన్​సీ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు రైతులు ఈ యాసంగిలో ఆరు తడి పంటలే వేసుకోవాలని సూచించారు. 

యాసంగి పంటలకు జనవరి1 నుంచి నీటిని విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. వారబందీ పద్ధతిన మార్చి31 వరకు మిడ్‌‌‌‌మానేరు, లోయర్ మానేరు రిజర్వాయర్ల నుంచి పంటలకు నీరు ఇస్తామని చెప్పారు. ఈ రెండు రిజర్వాయర్లలో కలిపి యాసంగి పంటలకు 27.541 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని వెల్లడించారు. ఈసారికి హుజూరాబాద్‌‌‌‌ వరకు సాగు చేసే పంటలకే నీరందుతుందని పేర్కొన్నారు. 

తాగునీటికి ప్రాధాన్యం..

ఈ సారి సాగునీటి కంటే.. తాగునీటికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు శంకర్‌‌‌‌ తెలిపారు. అందుకే పూర్తి ఆయకట్టుకు నీరివ్వడం కుదరడం లేదన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌‌‌‌కుమార్‌‌‌‌ రెడ్డి సూర్యాపేట వరకు నీరివ్వాలని సూచించారని తెలిపారు. అయినా నీటి లభ్యత లేని కారణంగా ఇవ్వలేకపోతున్నామన్నారు.