పాక్​ నేర్వాల్సిన పాఠాలు : డా. కూరపాటి వెంకట నారాయణ

అస్తవ్యస్తమైన పాలన, ఆర్థిక విధానాల మూలంగా మన పొరుగు దేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక రాజకీయ సంక్షోభంలో చిక్కుకుపోయింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉద్యమాలు జాతీయస్థాయిలో రాజకీయ అస్థిరత్వం ఈ సంక్షోభానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు.1980 నుంచి ఇప్పటి వరకు13 సార్లు ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాలని ప్రపంచ బ్యాంకు వాకిట నిలిచింది పాక్​ ప్రభుత్వం. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అత్యధికంగా వ్యవసాయం, టెక్స్​టైల్ పరిశ్రమపై ఆధారపడి ఉన్నది. ఆర్థిక వ్యవస్థలో ఆధునిక ఉత్పత్తి పద్ధతులు ప్రవేశ పెట్టలేకపోయింది. తయారీ వస్తువుల పరిశ్రమలు ఇతర పారిశ్రామిక, వినియోగ ఉత్పత్తుల ఉత్పత్తి రంగంలో ఎలాంటి అభివృద్ధిని సాధించలేకపోవడం వల్ల అత్యధికంగా దిగుమతులపై ఆధారపడి ఉంది. ఎగుమతుల కంటే దిగుమతులు రెండున్నర రెట్లు ఎక్కువగా ఉండటం విదేశీ మారక ద్రవ్య చెల్లింపులు మరింత జటిలమయ్యాయి. చెల్లింపుల సమస్య ఉండటం వల్ల ఇటీవల పాక్​విదేశీ వ్యాపారం(ఎగుమతులు, దిగుమతులు) తగ్గిపోతున్నది.

ఆర్థిక విధానాలు

నిరంతరం అస్థిరమైన ప్రభుత్వాలతో దేశ అవసరాలు, అవకాశాల దృష్ట్యా సరైన ఆర్థిక విధానాలను అమలు చేయలేకపోయింది. 2022లో సంభవించిన భారీ వర్షాలు, వరదల మూలంగా ఆర్థిక వ్యవస్థ మరింత చిన్నాభిన్నమై కోలుకోలేని దుస్థితికి చేరుకున్నది. దిగుమతులు విపరీతంగా పెరగడం, అదే స్థాయిలో ఎగుమతులు పెంచలేకపోవడం వల్ల విదేశీ మారకద్రవ్యం నిల్వలు నిండుకపోతున్నాయి. ప్రస్తుతం కేవలం మూడు వారాలకు సరిపోయే విదేశీ మారకద్రవ్య నిల్వలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఓడరేవుల్లో దించడానికి సిద్ధంగా ఉన్న సరుకులకుకూడా చెల్లింపులు చేస్తారో లేదో అనే అనుమానంతో వస్తువులను దించడం లేదు. ప్రభుత్వ ఆదాయంలో సింహ భాగం తెచ్చిన అప్పులపై వడ్డీ చెల్లింపులకే సరిపెట్టాల్సి వచ్చింది. జాతీయాదాయంలో 89 శాతం స్థాయికి అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అదనపు పన్నులు వేయడానికి అవకాశం లేదు కాబట్టి, ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడానికి వీలు లేదు. సబ్సిడీల మోత తగ్గించుకునే పరిస్థితి లేదు. నిత్యావసరాల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ద్రవ్యోల్బణం 27 శాతం దాటిపోయింది. కోడిగుడ్లు, వంట నూనెలు, గోధుమలు, ఉల్లిగడ్డలు, పాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మందుల షాపుల్లో ఎమర్జెన్సీ మెడిసిన్ ఇతర మందులు దొరకడం లేదు. సగటు మనిషి నిత్యావసర వస్తువులను కొనలేని స్థితిలో ఉన్నాడు. దీనంతటికీ కారణం దేశంలో రాజకీయ సుస్థిరత లేకపోవడం, రాజకీయ నాయకత్వ దుర్బలత్వం, లోపభూయిష్టమైన ఆర్థిక విధానాలు. ముఖ్యంగా అనుత్పాదక ప్రభుత్వ ఖర్చులు, రాజకీయ నాయకుల, అధికారుల అవినీతి, దోపిడీ కూడా ఆర్థిక వ్యవస్థ దుస్థితికి కారణంగా చెప్పవచ్చు. 

జనాభా నియంత్రణ లేక

పాక్​లోని వివిధ ప్రావిన్సెస్ లో దీర్ఘకాలంగా జరుగుతున్న ఉద్యమాలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నవి. బెలూచిస్తాన్, సింధు, బల్టిస్తాన్, పీవోకే ప్రాంతాల్లో నిరంతరం జరుగుతున్న స్వయం ప్రతిపత్తి సంబంధిత సంక్షోభాలు ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. అఫ్గాన్​ పరిణామాలు కూడా పాక్​కు ఆర్థిక, మిలిటరీ భారాన్ని మరింత పెంచింది. పాకిస్తాన్ మొత్తం అప్పుల్లో 35 శాతం చైనా నుంచి పొందినవే. ప్రస్తుతం దేశ జనాభా 3.5 % వృద్ధిరేటుతో ఇంకా పెరుగుతూ ఉంది. ప్రస్తుతం పాక్​ జనాభా 26 కోట్లకు చేరుకున్నది. ఈ దశాబ్దం అంతానికి 30 కోట్లకు చేరుతుందని అంచనా. పాకిస్తాన్ ఆర్థిక, సామాజిక అభివృద్ధి విధానాల్లో జనాభా నియంత్రణకు ఏనాడు ప్రయత్నించలేదు. చాందస భావాలతో మత సంబంధమైన ఉగ్రవాదులకు ఆలవాలమైపోయి ప్రస్తుత దుస్థితికి చేరుకున్నది. వ్యవసాయేతర ఉత్పత్తుల ఎగుమతుల గురించి ఎలాంటి విధానపర ప్రోత్సాహకాలుగానీ, ప్రయత్నాలు గానీ జరగలేదు. పాకిస్తాన్ ప్రస్తుత సంక్షోభం నుంచి బయట పడాల్సిన అవసరం ఆ దేశానికే కాదు పొరుగు, ప్రపంచ దేశాలకు కూడా అవసరమే. మిత్ర దేశమైన చైనా పాకిస్తాన్ సమగ్ర అభివృద్ధికి చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టకుండా దిగుమతులను తగ్గించడం గానీ, ఎగుమతులను పెంచుకోవడం గానీ సాధ్యం కాదని పాక్​ ఇప్పటికైనా గ్రహించాలి. విదేశీయుల సాయం పై ఆధారపడి ఉన్నంతకాలం అభివృద్ధి చెందలేమని అర్థం చేసుకోవాలి. సామాజిక రంగాలను, మానవ వనరులను అభివృద్ధి చేసి, స్థానిక వనరుల ఉపయోగాన్ని పెంచుకోవాలి. 

- డా. కూరపాటి వెంకట నారాయణ, రిటైర్డ్​ ప్రొఫెసర్