Hyderabad: హైదరాబాద్లోని ఈ ఏరియాల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్.. మరీ ఇంతలానా..?

హైదరాబాద్: భాగ్య నగరంలో వాహనదారులు మంగళవారం నాడు ట్రాఫిక్ కష్టాలు చవిచూశారు.  ట్యాంక్బండ్ , తెలుగు తల్లి ఫ్లై ఓవర్ , లక్డీకపుల్, రవీంద్రభారతి పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రాత్రి కురిసిన వర్షానికి వర్షపు నీరు రోడ్డుపై నిలిచింది. ఇవాళ ఉదయం కూడా హైదరాబాద్లో వర్షం కురిసింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయింది. ఈ కారణంగా ట్రాఫిక్తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు నిదానంగా కదులుతున్నాయి.

ఇక.. మాదిగ విజయ దండోరా యాత్ర పేరుతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి బషీర్ బాగ్లోని శ్రీ బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం వరకూ ర్యాలీకి ఎమ్మా్ర్పీస్ పిలుపునిచ్చింది. ఈ కారణంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఈ రూట్లో ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయని వాహనదారులు గమనించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ‘ఎక్స్’లో తెలిపారు. ఇక.. ఇలా సిటీలో వానలు పడ్డప్పుడు రోడ్లపై వరద నీరు నిలిచి.. ట్రాఫిక్ జామ్లు అయ్యే ఏరియాల్లో నివారణకు బల్దియా చర్యలు చేపట్టింది. వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద హోల్డింగ్ స్ర్టక్చర్లను నిర్మిస్తోంది.

ఇందుకు లక్ష, 5 లక్షలు, 10 లక్షల లీటర్ల కెపాసిటీతో పాయింట్ల వారీగా ట్యాంకుల నిర్మాణాలను చేపడుతోంది. ప్రస్తుతం సిటీలో 3 నుంచి 4 సెంటి మీటర్లకుపై వాన పడితే రోడ్లపై వరద నీరు నిలిచిపోయి  కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్లు ఏర్పడే పరిస్థితి ఉంది. కొన్నిచోట్ల రోడ్లను కూడా బంద్ చేస్తుంటారు.  వాటర్ లాగింగ్ సమస్యకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ల నిర్మాణానికి ఆదేశించింది. రాజ్ భవన్, సెక్రటేరియట్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే నిర్మాణాలు కొనసాగిస్తోంది. గ్రేటర్ సిటీలో రూ.10 కోట్లతో 50 ప్రాంతాల్లో నిర్మించనుంది.