హైదరాబాద్ ట్రాఫిక్ అప్డేట్.. ఈ రూట్లో వెళ్లారంటే ఇరుక్కుపోయినట్టే..

హైదరాబాద్: నానక్రామ్గూడ టోల్గేట్ నుంచి గచ్చిబౌలి జంక్షన్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. మేడిపల్లి రోడ్డుపై లారీ రిపేర్ అవ్వడం వల్ల ట్రాఫిక్ జామ్ అయినట్లు తెలిసింది. ట్రాఫిక్ కారణంగా వందలాది వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మూడు కిలోమీటర్ల దూరం వరకు ట్రాఫిక్ పోలీసులు కనబడలేదు. అంబులెన్స్ వెళ్లేందుకు కూడా ఖాళీ లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఈ ప్రాంతంలో పలు కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్న సంగతి తెలిసిందే. 

 

ఇక.. ట్రాఫిక్ కారణంగా మలక్పేట్లో వాహనదారులు వెళ్లేందుకు ఎక్కువ సమయం పడుతున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. న్యూ మార్కెట్ మెట్రో స్టేషన్, చర్మాస్, యశోదా హాస్పిటల్, నల్గొండ క్రాస్ రోడ్స్, అజాంపుర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయినట్లు తెలిసింది. ఇక.. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి వర్షం కురిసింది. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. 

కూకట్పల్లి, కేపీహెచ్బీ, మియాపూర్, హైదర్ నగర్, నిజాంపేట, బాచుపల్లి, అల్వాల్, శామీర్ పేట, జవహర్ నగర్, దమ్మాయిగూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్ పేట, ఎస్సార్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ, సనత్ నగర్, బషీర్ బాగ్ , అబిడ్స్ , హిమాయత్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం కావడంతో ప్రయాణికులు నరకయాతన అనుభవించారు.