- గోదావరి తీరాన నీట మునిగిన పంటలు
- జిల్లాలో మళ్లీ దంచికొట్టిన వాన 6.2 సె.మీ నమోదు
నిజామాబాద్, వెలుగు: కాస్త తెరిపిచ్చినట్లు కనబడిన వాన జిల్లాలో మరోసారి దంచికొట్టింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం పొద్దున 5 గంటల దాకా 6.2 సె.మీ వర్షం నమోదైంది. డొంకేశ్వర్‌లో అత్యధికంగా 16.2 సె.మీ వర్షం కురువగా ఇందూర్ పక్కనున్న ముగ్పాల్ మండలంలో 14.01 సె.మీ కురిసింది. ఆలూరులో 12.0, ఇందల్వాయిలో 11.3, ఆర్మూర్‌లో 10.5, డిచ్పల్లి, వేల్పూర్‌లో 10.0, రెంజల్ మండలంలో 9.0, మాక్లూర్ 8.9, నిజామాబాద్ నార్త్‌లో 7.04, సౌత్‌లో 6.8, నిజామాబాద్ మండలంలో 6.2 సె.మీ వర్షం నమోదైంది. వర్షం ధాటికి రోడ్లపై భారీ వరద పారింది.
కాలూర్ రోడ్ క్లోజ్
మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షం కారణంగా నగరంతో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపల్ లోతట్టు కాలనీ ఇండ్లలోకి వర్షం నీరు చేరింది. నగర శివారులోని కాలూర్-ఖానాపూర్ మెయిన్ రోడ్ మీదుగా రెండు ఫీట్ల మేరకు వరద పారడంతో రోడ్ క్లోజ్ చేశారు. దుబ్బా-బైసాస్ మీదుగా వాహనాలు నడువలేదు. మాణిక్‌బండార్ చౌరస్తాలో చెరువును తలపించేలా వర్షం నీరు చేరడంతో మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది డ్రైన్ పూడికను జేసీబీతో తొలగించి యుద్ధప్రతిపాదికన వాటర్ క్లియర్ అయ్యేలా చేశారు.
నీట మునిగిన పంటలు
ఎస్సారెస్సీకి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ మొదలైంది. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో పాటు మంజీరాలో వరద ఉధృతి పెరగడంతో ప్రాజెక్టుకు 3.05 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. 3.58 లక్షల క్యూసెక్కుల నీటిని ఇంజినీర్లు బయటకు వదిలేస్తున్నారు. ప్రాజెక్టుకు సుమారు 70 కిలోమీటర్ల దూరంలోని బోధన్ మండలం హంగర్గా, బిక్నెల్లి గ్రామాల వరకు బ్యాక్ వాటర్ ప్రభావం పడి పంటలు నీట మునిగాయి. జిల్లాలో 25 వేల ఎకరాలలో సోయాబిన్ పంట సాగవుతుండగా బోధన్ మండలంలోనే 20 వేల ఎకరాలు ఉంది. మరో మూడు వారాలలో కోతకు వచ్చే పంట నీట మునిగి కుళ్లిపోతోంది.