జగిత్యాలలో భారీ వర్షం.. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లు 

  • నాగర్​కర్నూల్, యాదాద్రిలోనూ భారీ వర్షం పడింది.
  • పిడుగుపడి వృద్ధుడు మృతి 
  • చెట్లు విరిగిపడి రెండు కార్లు ధ్వంసం 
  • మరికొన్ని జిల్లాలోనూ వర్షం
  • మరో నాలుగు రోజులు వానలు పడే చాన్స్ 

జగిత్యాల/హైదరాబాద్, వెలుగు: జగిత్యాల జిల్లాలో భారీ వర్షం కురిసింది. శనివారం ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో ఈదురుగాలులతో పెద్ద వాన పడింది. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. సడెన్ గా వర్షం పడడంతో వడ్లను కాపాడుకునేందుకు టార్పాలిన్లు కప్పాలని రైతులు పరుగులు తీసినా ఫలితం లేకపోయింది. జగిత్యాల, వెల్గటూర్, మద్దునూర్, బుగ్గారం, గొల్లపల్లి, పెగడపల్లి మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో వడ్లు భారీ వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. ఇప్పటికే అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని, ఇప్పుడు మళ్లీ వాన కురవడంతో కేంద్రాల్లోని వడ్లు తడిసిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రాలకు వడ్లు తెచ్చి నెల దాటినా కొనుగోలు చేయడం లేదని వాపోయారు. కాగా, ఈదురుగాలుల ధాటికి జిల్లా కేంద్రంలోని కృష్ణానగర్ లో చెట్టు విరిగి కరెంట్ స్తంభంపై పడింది. చెట్టు, పోల్ విరిగి పడడంతో అక్కడే నిలిపి ఉంచిన రెండు కార్లు ధ్వంసమయ్యాయి. వెల్గటూర్ మండలం జగదేవ్ పేటలో పిడుగు పడి క్యాతం రాజయ్య(70) అనే వృద్ధుడు మృతి చెందాడు. ఆయన గొర్లను మేపడానికి అటవీ ప్రాంతానికి వెళ్లగా, వర్షం కురవడంతో సమీపంలోని చెట్టు కిందకు వెళ్లాడు. ఆ టైమ్ లో చెట్టు మీద పిడుగు పడడంతో రాజయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే మండలంలోని శాఖపూర్ గ్రామంలో ఓ ఇంటి పక్కనున్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడడంతో అది కాలిపోయింది. పరిసర ప్రాంతాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. 

చందంపేటలో 6 సెం.మీ. వర్షపాతం..


శనివారం జగిత్యాల సహా మరికొన్ని జిల్లాల్లోనూ భారీ వర్షం పడింది. అత్యధికంగా నల్గొండ జిల్లా చందంపేటలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లా నాగారంలో 5.6, నల్గొండలోని నేరేడుగొమ్ములో 5.5, మంచిర్యాలలోని తాండూర్​లో 4.1, నాగర్​కర్నూల్​లోని ఉప్పునుంతలలో 3.8, సూర్యాపేటలోని జాజిరెడ్డిగూడెంలో 3.3, యాదాద్రిలోని గుండాలలో 3.1, అచ్చంపేటలో 2.8, జగిత్యాలలోని సిరికొండలో 2.7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది. వరంగల్, హనుమకొండ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, మేడ్చల్​మల్కాజిగిరి, మహబూబాబాద్, ఖమ్మం, నిజామాబాద్, జనగామ, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, నారాయణపేట, నిర్మల్​ జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. కాగా, రాష్ట్రవ్యాప్తంగా మరో నాలుగు రోజుల పాటు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 

తగ్గుతున్న ఉష్ణోగ్రతలు.. 

వర్షాల ప్రభావంతో పలుచోట్ల ఉష్ణోగ్రతలు కొంతమేర తగ్గాయి. రెండ్రోజుల కిందటి ఉష్ణోగ్రతలతో పోలిస్తే ఒకట్రెండు డిగ్రీలు తగ్గాయి. శనివారం అత్యధికంగా జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మహదేవ్​పూర్​లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజమాబాద్ జిల్లా వేంపల్లిలో 44.8, కుమ్రంభీమ్​ఆసిఫాబాద్ లోని కెరమెరిలో 44.7, సిద్దిపేటలోని చిట్యాలలో 44.4, ఆదిలాబాద్​లోని చాప్రాల, నిర్మల్​లోని కద్దంలలో 44.2, రాజన్న సిరిసిల్లలోని మల్లారంలో 44.1, నిజామాబాద్​లోని మెండోరాలో 44. ఆదిలాబాద్​లోనిఅర్లి టీ, కరీంనగర్​లోని గంగిపల్లిలో 43.9 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్​లో అత్యధికంగా గచ్చిబౌలిలో 41 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. సిటీలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలలోపే నమోదయ్యాయి. రానున్న రెండ్రోజుల పాటు కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్​భూపాలపల్లి మినహా మిగతా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.