చేతికొచ్చిన వరి, పసుపు  పంట పూర్తిగా తడిసిపోయింది

ఉమ్మడి జిల్లాలో  కురిసిన భారీ వడగండ్ల వాన  దెబ్బకు రైతుల ఆశలు ఆవిరయ్యాయి. నిజామాబాద్​ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి ఈదురుగాలులు, భారీ వర్షం పడడంతో  రైతులకు చేతికొచ్చిన వరి, పసుపు  పంట పూర్తిగా తడిసిపోయింది. కామారెడ్డి జిల్లాలో మంగళవారం కురిసిన భారీ వర్షానికి కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వడ్ల రాసులు  కండ్ల ముందే  వరద నీటిలో  కొట్టుకుపోతుంటే రైతులు  ఏమీ చేయలేక  లబోదిబోమన్నారు. 

ఆయా మండలాల్లో  పెద్ద పెద్ద వడగండ్లు పడ్డాయి. ఈదురు గాలులకు పలు చోట్ల మామిడి కాయలు రాలిపోయాయి. కరెంట్​పోల్స్​, రేకుల షెడ్లు పడిపోయాయి. కరెంట్​సరఫరా నిలిచిపోయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు10 వేల ఎకరాల్లో వరిపంట దెబ్బతిన్నట్లు  అధికారుల అంచనా..   లింగంపేట మండలంలో ఎక్కువగా 15వందల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్​లీడర్లు  ఆయా గ్రామాల్లో పర్యటించి రైతులకు మద్దతు తెలిపారు.  నెట్​వర్క్​, వెలుగు
.
 14 మేకలు మృతి

 ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల గ్రామానికి చెందిన ఓట్ల రాజయ్య  మంగళవారం తన  మేకలను  గ్రామ సమీపంలోని  అటవీ ప్రాంతంలో  మేపడానికి తీసుకెళ్లగా.. ఒక్కసారిగా వడగండ్ల వాన పడడంతో 14 మేకలు అక్కడికక్కడే చనిపోయాయి. అదే ప్రాంతంలో నల్ల పోచమ్మ   వర్రెలో పడి మరో 10 మేకలు  కొట్టుకుపోయాయని బాధితులు తెలిపారు. మిగతా మేకల కోసం గ్రామస్తుల సాయంతో గాలిస్తున్నారు. 

ధర్మారెడ్డిలో మహిళ మృతి

 ఈదురు గాలులు, వడగండ్ల వానకు  పైకప్పు రేకులు మీద పడి  నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డిలో  అందెల పద్మవ్వ ( 50)  చనిపోయారు.  రేకుల షెడ్డులో  నివసిస్తున్న పద్మవ్వ గాలికి  రేకులు లేచి మీద పడటంతో గాయాలై అక్కడికక్కడే చనిపోయినట్లు స్థానికులు తెలిపారు.