
- జనగామ జిల్లాలో 24 చోట్ల దెబ్బతిన్న రోడ్లు
- 9 రోడ్లు పూర్తిగా బ్లాక్ చేసిన ఆఫీసర్లు
జనగామ, వెలుగు : భారీ వర్షాలు, వరదల కారణంగా జనగామ జిల్లాలోని రోడ్లు ఆగమాగం అయ్యాయి. పలు చోట్ల కోతకు గురికాగా, మరికొన్ని చోట్ల పూర్తిగా కొట్టుకుపోయాయి. దీంతో ఆయా గ్రామాలకు వెళ్లే రోడ్లను పూర్తిగా బ్లాక్ చేసి వాహనాలను దారి మళ్లించారు. జనగామ జిల్లాలో మొత్తం 24 చోట్ల పంచాయతీరాజ్ శాఖ రోడ్లు దెబ్బతిన్నాయి. బచ్చన్నపేటలో 3, జనగామలో 6, రఘునాథపల్లిలో 3, జఫర్‌గఢ్‌లో 4, తరిగొప్పులలో ఒక రోడ్డుతో పాటు మరో 4 చోట్ల ఆర్‌అండ్‌బీ రోడ్లు దెబ్బతిన్నట్లు ఆఫీసర్లు తేల్చారు.
రాకపోకలు బంద్
వరద ప్రవాహంతో పాటు, పలు చోట్ల రోడ్లు పూర్తిగా దెబ్బతినడంతో ముందు జాగ్రత్తలో భాగంగాలో ఆఫీసర్లు రోడ్లను బ్లాక్ చేశారు. వరద కారణంగా లింగాల ఘన్‌పూర్ మండలం కుందారం – పటేల్‌గూడెం రోడ్డును పూర్తిగా బ్లాక్ చేశారు. నర్మెట మండలంలోని వెల్దండ, నర్మెట రోడ్డు కోతకు గురి కావడం, రఘునాథపల్లి మండలంలోని మాదారం దాసన్నగూడెం మధ్య రోడ్డు పూర్తిగా తెగిపోవడంతో ఆ రూట్లను బంద్ పెట్టారు. జనగామ మండలంలోని ఎర్రగొల్లపహాడ్ నుంచి పెద్దతండా మధ్యలోని కల్వర్టు దెబ్బతింది. గోపరాజుపల్లి నుంచి మొరంబాయి, గానుగుపహాడ్ వద్ద నిర్మాణంలో ఉన్న జనగామ – నర్మెట రోడ్డు దెబ్బతినడంతో వాహనాలను వెంకిర్యాల మీదుగా మళ్లించారు.
అడవి కేశవాపూర్ – కన్నెబోయినగూడెం మధ్య రోడ్డు తెగిపోయింది. ఎల్లంల – సిద్దెంకి మధ్య ఇంకా వరద పారుతున్నందున ఆ రోడ్డును బ్లాక్ చేశారు. గోపరాజుపల్లి నుంచి కేసిరెడ్డిపల్లి రోడ్డు కోతకు గురికాగా, జఫర్‌గడ్ మండలంలోని కోనాయిచలం వెళ్లే రోడ్డు రెండు చోట్ల దెబ్బతింది. ఇదే మండలంలోని తమ్మడపల్లి, రఘనాథపల్లి రోడ్లు కోతకు గురయ్యాయి. రోడ్లకు రిపేర్లు చేసేందుకు అవసరమైన రిపోర్టును పీఆర్, ఆర్‌అండ్‌బీ ఆఫీసర్లు కలెక్టర్‌కు, ఉన్నతాధికారులకు పంపించారు.
బ్రిడ్జి మంజూరు చెయ్యాలే
వెల్దండ రోడ్డు దెబ్బతినడంతో రాకపోకలకు ఇబ్బంది అయితంది. నర్మెటతో పాటు చేర్యాల టౌన్‌కు వెళ్లేందుకు కూడా ఈ రోడ్డే ఆధారం. వానలకు దెబ్బతిన్న రోడ్డుకు వెంటనే రిపేర్లు చేయడంతో పాటు, బ్రిడ్జి మంజూరు చేయాలి.
- పాతూరి హన్మరెడ్డి, వెల్దండ, నర్మెట మండలం