హిమాయత్ సాగర్ కు భారీగా వరద నీరు.. 2 గేట్లు ఎత్తివేత

హిమాయత్ సాగర్ కు భారీగా వరద నీరు.. 2 గేట్లు ఎత్తివేత

హైద‌రాబాద్ : న‌గ‌ర శివార్లలో ఉన్న జంట జ‌లాశ‌యాలు ఉస్మాన్ సాగ‌ర్, హిమాయ‌త్ సాగ‌ర్‌కు వ‌ర‌ద నీరు పోటెత్తుతోంది. ఈ నేప‌థ్యంలో హిమాయ‌త్ సాగ‌ర్ 2 గేట్లను 2 ఫీట్ల మేర ఎత్తి దిగువ‌కు నీటిని విడుద‌ల చేస్తున్నారు. ఈ రెండు గేట్ల ద్వారా 700 క్యూసెక్కుల నీటిని దిగువ‌కు విడుద‌ల చేస్తున్నట్లు ఇరిగేషన్ శాఖ అధికారులు వెల్లడించారు.

హిమాయ‌త్ సాగ‌ర్ గేట్లు ఎత్తడంతో మూసీ నది ప్రవాహం పెర‌గ‌నుంది. దీంతో మూసీ ప‌రివాహక‌, లోత‌ట్టు ప్రాంతాల ప్రజ‌ల‌ను అధికారులు అప్రమ‌త్తం చేశారు. హిమాయ‌త్ సాగ‌ర్‌కు 1200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. సాగ‌ర్ పూర్తిస్థాయి నీటిమ‌ట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమ‌ట్టం 1762.20 అడుగులుగా ఉంది. ఇక ఉస్మాన్ సాగ‌ర్‌లో 1100 క్యూసెక్కుల వ‌ర‌ద వ‌చ్చి చేరుతోంది. ఉస్మాన్ సాగ‌ర్ పూర్తి స్థాయి నీటిమ‌ట్టం 1790 అడుగులు కాగా, ప్రస్తుతం 1784.70 అడుగుల‌కు చేరింది.