మహారాష్ట్ర రెండో రాజధాని నాగ్‌పూర్. అక్కడ ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు ఓ ప్రభుత్వరంగ బ్యాంకు మునిగిపోయింది. ఈ వరదల్లో రూ.400 కోట్ల కరెన్సీ తడిసిపోయింది. ఇదే విషయాన్ని సదరు బ్యాంకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు తెలిపింది. సదరు రిపోర్టు చూసి ఆర్బీఐ అధికారులే షాక్ అయ్యారు.
2023, సెప్టెంబర్ 22, 23 తేదీల్లో మహారాష్ట్రలో ఈ ఏడాది రుతుపవనాలు తక్కువగా నమోదయ్యాయి. సెప్టెంబర్ 22, 23 తేదీల్లో నాగ్‌పూర్‌లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో నాగ్‌పూర్ నగరం జలమయమైంది. ఇళ్లు, కార్యాలయాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు రెస్క్యూ సిబ్బంది. నాగ్‌పూర్ గుండా ప్రవహించే నాగ్ నది ఉప్పొంగడంతో ఇండ్లల్లోకి నీరు వచ్చింది. ఈ నది ఒడ్డున ఉన్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర జోనల్ కార్యాలయం కూడా ఉంది. ఇక్కడి నుంచే నాగ్‌పూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని బ్యాంకులకు డబ్బులు పంపిణీ చేస్తారు. ఈమేరకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రతో ఆర్బీఐ ఒప్పందం కుదుర్చుకుంది.
ఒప్పందం ప్రకారం ఆర్‌బీఐ నుంచి డబ్బు నేరుగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు డెలివరీ చేస్తారు. అక్కడి నుంచి తీసుకెళ్లి ఇతర బ్యాంకులకు డెలివరీ చేస్తారు. ఇతర బ్యాంకులు ఇచ్చిన డబ్బును నాగ్‌పూర్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర జోనల్ కార్యాలయంలో డిపాజిట్ చేస్తారు. అయితే.. భారీ వర్షాల సమయంలో నాగ్ నది ఉప్పొంగడంతో ఈ జోనల్ కార్యాలయం కూడా నీట మునిగి క్యాష్ రూమ్ మొత్తం తడిసిపోయింది.
కార్పొరేషన్ సిబ్బందికి మోటార్ తో నీటిని తోడేందుకు ఒకరోజు సమయం పట్టడంతో బ్యాంకులోని డబ్బులు పూర్తిగా నీటిలో నానిపోయాయి. రూ.400 కోట్ల మేర సొమ్ము వృథా అయినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. దెబ్బతిన్న కరెన్సీ నోట్లను ఆర్బీఐ అధికారులు పరిశీలించారు. దెబ్బతిన్న కరెన్సీ నోట్లను అధికారులు స్కాన్ చేసి లెక్కించారు. ఆ కరెన్సీ నోట్ల స్థానంలో ఆర్‌బీఐ రీప్లేస్‌మెంట్ కరెన్సీ నోట్లను విడుదల చేసింది. భవిష్యత్తులో ఇలాంటి సమస్య తలెత్తకుండా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అధికారులు తెలిపారు.