భారీ వర్షం.. స్తంభించిన జనజీవనం

ఆదిలాబాద్​టౌన్, వెలుగు : మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని మండలాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్లు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరింది. ఇచ్చోడలోని దుబారపేటలోకి  ఇండ్లన్నీ నీట మునిగాయి. దీంతో  హైవేపై గిరిజనులు  బైఠాయించి నిరసన తెలిపారు. ఇక్కడ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాన్వాయ్ ఇరుక్కుపోయింది. కౌటల మండలం తలోడి గ్రామానికి చెందిన గోడిసెల దేవమ్మకు చెందిన ఇల్లు కూలిపోయింది.

కన్నేపల్లి ,కన్కి ప్రాజెక్ట్  ప్రవహిస్తుండంతో సుమారు వంద క్వింటాళ్ల చేపలు వరదలో కొట్టుకోపోయాయి. కుమ్రంభీం, స్వర్ణ   ప్రాజెక్టుల  గేట్లు ఎత్తారు. కుంటాల, పొచ్చెర జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. కుంటాల జలపాతానికి పర్యాటకులను నిలిపివేశారు. నెన్నెల మండల కేంద్రంలోని కాపువాడలో తోట తిరుపతికి చెందిన ఇళ్లు కూలిపోయింది.

మంచిర్యాల జిల్లాలో వరద సహాయక చర్యల కోసం కలెక్టరేట్​లో కంట్రోల్​ రూమ్ ను ఏర్పాటు చేశామని కలెక్టర్​ బదావత్​ సంతోష్​ తెలిపారు.

ప్రజలు : 08736–250501 నంబర్​కు కాల్​ చేస్తే సంబంధిత అధికారులు స్పందిస్తారన్నారు. జైపూర్/ఇచ్చోడ/కుంటాల/ఆసిఫాబాద్/ నార్నూర్/బెల్లంపల్లి రూరల్/ఆదిలాబాద్​