గద్వాల సర్కార్ దవాఖానలో సౌలతుల్లేవ్

గద్వాల సర్కార్  దవాఖానలో సౌలతుల్లేవ్
  • సిబ్బంది ఇష్టారాజ్యంతో తిప్పలు పడుతున్న పేషెంట్లు

గద్వాల, వెలుగు : సర్కార్  దవాఖానలో సౌలతులు లేకపోవడంతో హాస్పిటల్ కి వచ్చే పేషెంట్లు తిప్పలు పడుతున్నారు. ఇక్కడ పనిచేసే డాక్టర్లు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో పేషెంట్లకు క్వాలిటీ ట్రీట్మెంట్  అందడం లేదనే విమర్శలున్నాయి. పేషెంట్లను నిలబెట్టే ఇంజక్షన్  చేయడంపై రోగులతో పాటు వారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఆర్వో ప్లాంటు పనిచేయకపోవడంతో హాస్పిటల్ కి వచ్చే రోగులు మంచినీళ్లకు తిప్పలు పడుతున్నారు. 

మూలనపడ్డ వాటర్​ ప్లాంట్లు..

గద్వాల సర్కార్  దవాఖానలో బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు పోటీ పడి మరీ మంచినీళ్ల ప్లాంట్లను ఏర్పాటు చేశారు. 6 నెలలు గడవక ముందే అవి మూలకు పడ్డాయి. దీంతో రోగులకు మంచినీళ్లు దొరకని పరిస్థితి నెలకొంది.

పేషెంట్లకు, భోజనాలు చేసే వారికి నీళ్లు కావాలన్నా? బయట నుంచి కొనుగోలు చేసుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. రోగులు, వారి సహాయకులు భోజనాలు చేసేందుకు కనీస సౌకర్యం లేకపోవడంతో హాస్పిటల్  ముందు భోజనాలు చేస్తున్నారు. ఎవరైనా ఆందోళన చేస్తే ఒకటి రెండు రోజులు హడావుడి చేసి, ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో ఎలాంటి మార్పులు రావట్లేదని వాపోతున్నారు.

నిలబెట్టే ఇంజక్షన్లు చేస్తున్రు..

రోగుల పట్ల హాస్పిటల్ లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. పేషెంట్లను నిలబెట్టే ఇంజక్షన్లు చేసి వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఆ సమయంలో పేషెంట్  కదిలినా, నీడిల్  విరిగినా ప్రమాదమేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. డాక్టర్లు సమయపాలన పాటించడం లేదని, సర్కార్  దవాఖానలో డ్యూటీ కన్నా సొంత హాస్పిటల్స్​కే ఎక్కువ టైం కేటాయిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

ఇక్కడ పనిచేసే ప్రతి డాక్టర్​కు గద్వాలలో ప్రైవేట్​ హాస్పిటల్  ఉండడం గమనార్హం. డెలివరీ వార్డులో వీల్​ చైర్, స్ట్రెచర్​పై​బాలింతను తీసుకుపోవడానికి ఒక రేటు, పాపను చూపించడానికి ఒకరేటు అంటూ వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇక్కడ పనిచేసే కింది స్థాయి సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు పేషెంట్ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. దీనిపై కంప్లైంట్​ చేసినా పట్టించుకోవడం లేదని పేషెంట్లు, వారి బంధువులు ఆరోపిస్తున్నారు. 

టెస్టులు చేస్తలేరు..

సర్కార్ దవాఖానలో మెషీన్లు చెడిపోవడంతో టెస్టులు చేయడం లేదు. దీంతో హాస్పిటల్ కి వచ్చే బాలింతలు, గర్భిణులు, ఇతర పేషెంట్లు ప్రైవేట్ ల్యాబుల్లో టెస్ట్ చేయించుకోవాల్సి వస్తోంది. ఆర్ఎఫ్టీ, ఎల్ఎఫ్టీ లిపిడ్  ప్రొఫైల్, యూరిక్  యాసిడ్, టోటల్  బయో కెమిస్ట్రీ టెస్టుల కోసం ఒక్కొ పేషెంట్  రూ.1,000 నుంచి రూ.1,500 ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ వ్యవహారంలో ఇక్కడి డాక్టర్లకు ప్రైవేట్​ ల్యాబ్​ నిర్వాహకులు కమీషన్లు ముట్టు చెబుతున్నట్లు ఆరోపణలున్నాయి.

సమస్యలు లేకుండా చూస్తాం..

సర్కార్ దవాఖానలో పేషెంట్లకు సమస్యలు లేకుండా చూస్తాం. భోజనాలు చేసేందుకు షెడ్  కోసం ప్రపోజల్  పంపించాం. నిలబెట్టి ఇంజక్షన్లు చేస్తున్న విషయం నా దృష్టికి వచ్చింది. ఇప్పటికే వారికి సీరియస్ గా వార్నింగ్  ఇచ్చాను. కొన్ని టెస్టులు హాస్పిటల్​లో చేస్తున్నాం. మిగిలిన టెస్టులు త్వరలో చేస్తాం. - 

డాక్టర్  కిశోర్ కుమార్, సూపరింటెండెంట్