యాదాద్రి, వెలుగు : మూడేండ్లుగా ఎదురు చూస్తున్నా పరిహారం రాకపోవడంతో బస్వాపురం నిర్వాసితులు లీడర్ల ఫోటోలు అతికించిన పాడెను మోసి నిరసన వ్యక్తం చేశారు. యాదాద్రి జిల్లాలో నిర్మిస్తున్న బస్వాపురం రిజర్వాయర్ కారణంగా బీఎన్ తిమ్మాపురం గ్రామం మునిగిపోతోంది. మూడేండ్ల కింద ప్రకటించిన అవార్డ్ప్రకారం ఇప్పటివరకు పరిహారం ఇవ్వపోవడంతో 23 రోజులుగా బీఎన్ తిమ్మాపురం వాసులు రిజర్వాయర్ కట్టపై ఆందోళన చేస్తున్నారు. నిరసనలతో భాగంగా ఇటీవల సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆర్డీవో భూపాల్‌రెడ్డిని కలిసి సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు.
అడిషనల్కలెక్టర్నిర్వాసితుల వద్దకు వెళ్లి మాట్లాడారు. కలెక్టర్వచ్చి హామీ ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్‌చేశారు. కానీ కలెక్టర్మాత్రం నిర్వాసితుల వద్దకు వెళ్లలేదు. దీంతో ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే బుధవారం బస్వాపురం రిజర్వాయర్ కట్టమీద సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఫోటోలు దిష్టిబొమ్మపై అతికించి దానిని పాడెపై పెట్టి మోశారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. దిష్టిబొమ్మ దహనంలో కొందరు టీఆర్ఎస్లీడర్లు సైతం పాల్గొనడం గమనార్హం.