- జిల్లాలో కొనుగోలు కేంద్రాలు లేక రైతులకు తిప్పలు
- ఎక్కువవుతున్న ట్రాన్స్పోర్ట్ ఖర్చులు
- ఇప్పటికైనా ఏర్పాటు చేయాలని కోరుతున్న రైతులు
మెదక్, టేక్మాల్, వెలుగు : జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు పత్తి అమ్ముకునేందుకు పక్క జిల్లాలకు పోవాల్సి వస్తోంది. దీనివల్ల వ్యయ ప్రయాసలు ఎదురవుతున్నాయి. జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. జిల్లాలో ఈ వానకాలంలో 36,142 ఎకరాల్లో పత్తి పంట సాగైంది. ప్రధానంగా రేగోడ్, అల్లాదుర్గం, టేక్మాల్, పాపన్నపేట, చేగుంట, నార్సింగి, రామాయంపేట, నిజాంపేట, కౌడిపల్లి, చిలప్చెడ్మండలాల్లో పత్తి పంట ఎక్కువగా సాగు చేశారు.
అకాల వర్షాల కారణంగా పత్తి పంట దెబ్బతింది. పరిస్థితులు అనుకూలిస్తే ఎకరాకు10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చేంది. అయితే ప్రతి కూల పరిస్థితుల కారణంగా ఇప్పుడు ఎకరా యావరేజ్‌గా 8 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన జిల్లాలో 2.88 లక్షల క్వింటాళ్ల దిగుబడి రానుంది.
ప్రతి సీజన్లో ఇబ్బందే..
కాటన్ కార్పరేషన్ఆఫ్ఇండియా (సీసీఐ) నిబంధనల ప్రకారం జిన్నింగ్ మిల్లులు ఉన్న చోట మాత్రమే పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. మెదక్ జిల్లాలో ఎక్కడా జిన్నింగ్ మిల్లులు లేవు. దీంతో ఎక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే ఛాన్స్‌లేదు. పొరుగున ఉన్న సంగారెడ్డి జిల్లా ఆందోల్మండల పరిధిలోని కంసాన్‌పల్లిలో ఉన్న సిద్దార్ధ్ ఫైబర్జిన్నింగ్ మిల్లు వద్ద పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
మెదక్ జిల్లాలోని రేగోడ్, అల్లాదుర్గం, టేక్మాల్, పాపన్నపేట మండలాల రైతులు పండించిన పత్తిని అక్కడికి వెళ్లి అమ్ముకోవాల్సిఉంటుంది. ఇది మినహా జిల్లాలో మరెక్కడా కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో కొల్చారం, కౌడిపల్లి, నర్సాపూర్, చిలప్ చెడ్, శివ్వంపేట, నిజాంపేట, రామాయంపేట, చేగుంట, వెల్దుర్తి, తూప్రాన్ మండలాల రైతులు పత్తి అమ్ముకునేందుకు 20 నుంచి 50 కిలోమీటర్ల దూరంలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలానికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దూరంలో ఉన్న కొనుగోలు కేంద్రాలకు పత్తిని తరలించాల్సి రావడం వల్ల రైతులపై రవాణా ఖర్చుల భారం పడనుంది.
ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్కువ
నేను రెండెకరాల్లో పత్తి సాగు చేశా. ఈ సారి వర్షాలు ఎక్కువ పడడంతో ఎకరాకు 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తోంది. జిల్లా పరిధిలోఎక్కడా పత్తి కొనుగోలు కేంద్రం లేకపోవడంతో పత్తి అమ్మేందుకు సంగారెడ్డి జిల్లాలోని కొనుగోలు కేంద్రానికి వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల ఇబ్బంది కలగడంతోపాటు, ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్కువ అవుతుంది. పాపన్నపేట మండలం నార్సింగిలో గోడౌన్స్ఉన్నందున అక్కడ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే సౌకర్యవంతంగా ఉంటుంది. - సాయిబాబా, రైతు, తంపులూర్