ఈ నెల 28న రాష్ట్రపతి పర్యటన..భద్రాచలంలో అమల్లోకి కఠిన ఆంక్షలు

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనానికి ఈనెల 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వస్తున్న నేపథ్యంలో కఠిన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఆ రోజు భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లోని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఐటీసీ నుంచి భద్రాచలం వచ్చే మార్గంలో 28 వ తేదీన ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వాహనాల రాకపోకలు రద్దు చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, హెల్త్ ఎమర్జెన్సీ అయితే లోకల్ పోలీసులకు ఫోన్​ చేయాలని, వారి వాహనంలోనే దవాఖానాకు తీసుకెళ్తారని ప్రచారం చేస్తున్నారు. ప్రతీ ఇంట్లో పోలీస్​స్టేషన్ ఫోన్​ నెంబర్లు ఇస్తున్నారు. ఆ రోజు 144 సెక్షన్​ విధించారు. ఆరుగురు ఎస్పీలు, 25 మంది ఏఎస్పీలు, 50 మంది డీఎస్పీలు,80 మంది సీఐలతో పాటు ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్​కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, యాంటీ నక్సల్స్ స్క్వాడ్స్, గ్రేహౌండ్స్ బలగాలు, కేంద్ర సర్వీసుల నుంచి సీఆర్​పీఎఫ్​ జవాన్లు సుమారు 1000 మంది రాష్ట్రపతి భద్రతలో భాగస్వాములవుతున్నారు. 

భద్రాచలంలో రూట్​మార్చ్​

భద్రాచలం సీఐ నాగరాజురెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు, సీఆర్​పీఎఫ్​ బలగాలు ఆదివారం భద్రాచలంలోని గోదావరి వంతెన నుంచి రామాలయం వరకు రూట్​మార్చ్ నిర్వహించాయి. రాష్ట్రపతి కాన్వాయ్​కు ఆటంకం కలగకుండా రోడ్డుకు రెండు వైపులా రెయిలింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఆలయం చుట్టూ ఉన్న షాపులను వెనక్కి జరిపారు. 28న షాపులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. పట్టణం నలుమూలలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అనుమానితుల కదలికలు పరిశీలిస్తున్నారు.  

లాడ్జీలు స్వాధీనం

భద్రాచలంలోని లాడ్జీలను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. కొత్తవారు ఎవరైనా ఉంటే టౌన్​విడిచి వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నారు. సారపాక ఐటీసీ ఫ్యాక్టరీ చుట్టూ, భద్రాచలంలోని శివారు కాలనీల్లో కార్డెన్​ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ప్రతీ ఒక్కరి ఆధార్​కార్డులు పరిశీలిస్తున్నారు. రాష్ట్రపతి కాన్వాయ్ మార్గంలోని ఇరువైపులా ఉన్న ఎత్తయిన భవనాలపై పోలీసులు పహారా కాస్తున్నారు. కొత్తవారికి ఆశ్రయం ఇవ్వొద్దని స్థానికులను కోరుతున్నారు. అనుమానితులు కన్పిస్తే తక్షణమే సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.