నడిగడ్డ సాగునీటి ప్రాజెక్టులు..ఆగమాగం!

నడిగడ్డ సాగునీటి ప్రాజెక్టులు..ఆగమాగం!
  •     రెండేళ్లు దాటినా ర్యాలంపాడ్  రిజర్వాయర్  బుంగలకు రిపేర్లు చేస్తలే
  •     తుమ్మిళ్లలో పంప్  ఏర్పాటు చేసినా రిజర్వాయర్లు నిర్మించట్లే
  •     ఆర్డీఎస్  ఆధునికీకరణ ఊసెత్తని గత సర్కారు

గద్వాల,వెలుగు : పదేండ్లుగా నడిగడ్డ సాగునీటి ప్రాజెక్టులను గత సర్కారు పట్టించుకోకపోవడంతో పంటలకు నీళ్లు అందని పరిస్థితి తలెత్తింది. ఆర్డీఎస్ పైనే తెలంగాణ ఉద్యమం జరిగినా, రాష్ట్రం వచ్చాక ఆ ప్రాజెక్టును పట్టించుకోకపోవడంతో నేటికీ పూర్తిస్థాయిలో నీళ్లు ఇవ్వని పరిస్థితి ఉంది. కాంగ్రెస్  హయాంలో కట్టిన నెట్టెంపాడు ప్రాజెక్టులోని ర్యాలంపాడు రిజర్వాయర్ కు బుంగలు పడి మూడేండ్లైనా రిపేర్ల ఊసే ఎత్తలేదు.

దీంతో ఆ రిజర్వాయర్ లో నాలుగు టీఎంసీలకు బదులుగా రెండేండ్లుగా రెండు టీఎంసీలే నింపుతున్నారు. ఇప్పుడు ఆ రెండు టీఎంసీల నీరు కూడా నిల్వ చేసే పరిస్థితి లేదు. తుమ్మిళ్ల లిఫ్ట్ ను ఏర్పాటు చేశారే తప్ప వాటికి సంబంధించిన రిజర్వాయర్ల నిర్మాణం జరగకపోవడంతో తుంగభద్ర నదిలో నీళ్లు తగ్గినప్పుడు మోటార్లు బంద్  చేసి పంట పొలాలకు నీళ్లు ఇవ్వలేకపోతున్నారు. ఇలా అన్ని ప్రాజెక్టులు ఆగమాగం కావడంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా మొదటిసారి అన్ని ప్రాజెక్టుల పరిధిలో క్రాప్  హాలిడే ప్రకటించారు.

నెట్టెంపాడును పట్టించుకోలే..

కాంగ్రెస్  పార్టీ హయాంలో చేపట్టిన నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాన్ని బీఆర్ఎస్  సర్కారు పట్టించుకోకపోవడంతో సాగునీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది. గద్వాల సస్యశ్యామలం కావడానికి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ఎంతగానో ఉపయోగపడింది. అలాంటి పథకానికి రిపేర్లు లేక, మిగిలి ఉన్న 10 శాతం పనులు పూర్తి చేయకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ర్యాలంపాడు రిజర్వాయర్ కు 2019లో లీకేజీలు అవుతున్నట్లు గుర్తించారు.

వాటికి రిపేర్లు చేయాలని రైతులు ఆందోళన చేస్తే 2021లో రిటైర్డ్  ఇంజనీర్ల బృందం రిజర్వాయర్ ను పరిశీలించింది. రిజర్వాయర్  కట్ట డేంజర్ లో ఉందని నాలుగు టీఎంసీల నీళ్లు నిలువ ఉంచితే కట్టకు ప్రమాదమని హెచ్చరించడంతో, 2021 నుంచి కేవలం రెండు టీఎంసీలే నిల్వ చేస్తున్నారు. బుంగలు ఎలా పడ్డాయి? రిపేర్లు చేస్తే ఎట్లా ఉంటుందనే విషయంపై సర్వే చేస్తామని ప్రకటించి, ఏడాది తర్వాత శ్రీ సాయి గణేశ్​ కంపెనీకి సర్వే పనులను అప్పగించారు.

ఆరు నెలలకు సర్వే చేసి నివేదికను సీడీవో(సెంట్రల్  డిజైన్ ఆఫీస్​కు) అందించారు. నివేదిక ఇచ్చి ఏండ్లు గడుస్తున్నా రిపేర్లు చేయకపోవడంతో సగం ఆయకట్టుకు నీరందిస్తున్నారు. పూర్తి స్థాయిలో నీళ్లు నిల్వ చేయకపోవడంతో లెఫ్ట్  కెనాల్  కింద 25 వేల ఎకరాలకు, రైట్  కెనాల్  కింద 1.11 లక్షల ఎకరాలకు సాగునీరు అందడం లేదు.

రిజర్వాయర్లు లేకుండానే..

తుమ్మిళ్ల లిఫ్ట్ లో భాగంగా రిజర్వాయర్లు కట్టకుండానే ఒక పంప్​ను గత సర్కార్​ ఆన్  చేసి చేతులు దులుపుకుందనే విమర్శలున్నాయి. ఆర్డీఎస్  కెనాల్ చివరి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో తుంగభద్ర నదిపై రాజోలి మండలం తుమ్మిళ్ల విలేజ్  దగ్గర రూ.783 కోట్లతో లిఫ్ట్  ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మల్లమ్మ కుంట, వల్లూరు, జూలకల్లు రిజర్వాయర్ల నిర్మాణంతో పాటు పంప్ హౌస్ నిర్మాణాలను చేపట్టాలని ఎస్టిమేషన్లు రెడీ చేశారు. అయితే 2019లో ఎన్నికల ముందు హడావుడిగా తుమ్మిళ్ల దగ్గర ఒక పంపును ఆన్  చేసి రిజర్వాయర్ల నిర్మాణాన్ని పక్కన పెట్టారు.

ఉద్యమ సమయంలో ఆర్డీఎస్ పై పోరాటం చేసిన కేసీఆర్, రాష్ట్రం వచ్చాక ఆ సమస్యను పరిష్కరించలేదనే విమర్శలున్నాయి. ఆర్డీఎస్ లో నీరు లేకపోవడంతో 87,500 ఎకరాలకు సాగునీరు అందడం లేదు. కృష్ణా బేసిన్ లో ఈ ఏడాది నీరు లేకపోవడంతో జూరాల ఆయకట్టుకు ఈసారి క్రాప్ హాలిడే ప్రకటించారు. దీంతో మూడు ప్రాజెక్టుల పరిధిలో రెండున్నర లక్షల ఎకరాలకు క్రాప్ హాలిడే ప్రకటించినట్లైంది.

సర్కార్  దృష్టికి తీసుకెళ్తాం..

ప్రాజెక్టుల్లో పెండింగ్ పనులను అప్పటి సర్కార్  దృష్టికి తీసుకెళ్లాం. కొత్త ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాం. వచ్చే సీజన్ లో అన్ని ప్రాజెక్టుల పరిధిలో నీళ్లు ఇచ్చేందుకు  ప్రయత్నం చేస్తున్నాం. పెండింగ్ పనులు కంప్లీట్ అయితే చివరి ఆయకట్టుకు కూడా సాగునీళ్లు అందుతాయి. 
-
 రహీముద్దీన్, ఈఈ, ఇరిగేషన్