రోడ్డు తెగడంతో పేషెంట్లకు కష్టాలు

రోడ్డు తెగడంతో పేషెంట్లకు కష్టాలు

దహెగాం, వెలుగు: వరదలతో తెగిన రోడ్డు మీద ఆటో వెళ్లలేని పరిస్థితిలో పెరాలసిస్​తో బాధ పడుతున్న తండ్రిని అతని కొడుకు చేతులపై మోస్తూ అవతలి వైపు తరలించాడు. దహెగాం మండలం బీబ్రా గ్రామానికి చెందిన వెలిశాల వెంకటేశం రెండు నెలల నుంచి పెరాలిసిస్​తో బాధ పడుతున్నాడు. చంద్రాపూర్ లోని ప్రైవేట్ హాస్పిటల్​ లో  ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. ఈ నెల 22 న డాక్టర్  అపాయింట్​ మెంట్​ ఉన్నా వరదల వల్ల అక్కడికి వెళ్లలేకపోయారు. వెంకటేశం ఆరోగ్యపరిస్థితి ఇబ్బందిగా మారడంతో సోమవారం అతని కొడుకు సాయి, కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు తీసుకెళ్లేందుకు ఆటో ఎంగేజ్ చేసుకున్నారు. బీబ్రా దగ్గరున్న లో లెవెల్ బ్రిడ్జి వద్ద  రోడ్డు తెగిపోవడంతో ఆటో ముందుకెళ్లలేకపోయింది. దాంతో సాయి తండ్రిని  చేతులమీద మోస్తూ.. బురదలో నడుచుకుంటూ రోడ్డు దాటించాడు. అక్కడ మరో ఆటోలో కాగజ్​నగర్ వెళ్లారు. అక్కడ కూడా పెద్దవాగు ఉప్పొంగి..  బ్రిడ్జి మీద రాకపోకలు నిలిపివేశారు. సిబ్బందిని బతిమిలాడి ఆటోను బ్రిడ్జి దాటించి.. ఆక్కడినుంచి మరో  కారు లో హాస్పిటల్ కు తరలించారు. ఆటంకాలను దాటుకుంటూ తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లిన సాయిని గ్రామస్తులు అభినందించారు.  

వాగులో చిక్కుకున్న రైతు
కాగజ్ నగర్, వెలుగు:  పొలంలో నారు ఎలా ఉందో చూడాలని వెళ్లిన రైతు వాగులో చిక్కుకున్నాడు. ఎడ్లు, బండి వరదలో కొట్టుకుపోగా రైతును గజ ఈతగాళ్లు కాపాడారు.  కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బాబా సాగర్ కు చెందిన సాయినాథ్​సోమవారం ఉదయం ఎడ్లబండిమీద భార్యను తీసుకుని పొలానికి బయలుదేరాడు. బాబా సాగర్, నాయికపూగూడ మధ్య అర్కగుడా ప్రాజెక్ట్ కింద వాగు ఉప్పొంగడంతో ముందుకు వెళ్లవద్దని అతని భార్య వారించింది. ఆమె అక్కడే దిగిపోగా సాయినాథ్​ ముందుకు వెళ్లాడు. మధ్యలోకి వెళ్లగానే వాగు ఉధృతికి ఎడ్లు బెదరడంతో ఎడ్లు, కొట్టుకుపోయాయి. సాయినాథ్​ బ్రిడ్జి పిల్లర్లకున్న ఇనుపరాడ్లను పట్టుకుని కాపాడాలంటూ అరిచాడు. పోలీసులు గజ ఈతగాళ్లతో వచ్చి అతన్ని బయటకు తీశారు.