కేసీఆర్ యాదాద్రి టూర్.. ఆర్జిత సేవలు బంద్

ఈ నెల 18న సీఎం కేసీఆర్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. కేసీఆర్ తో పాటుగా కొందరు జాతీయ నేతలు కూడా స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈ క్రమంలో భద్రతా కారణాల దృష్ట్యా ఆలయంలో జరిపే ఆర్జిత సేవలు, నిత్యకల్యాణం కార్యక్రమాలను ఆలయ అధికారులు రద్దు చేశారు. అలాగే ఉదయం 9 నుండి 10 గంటల వరకు నిర్వహించే బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేశారు. ఆలయంలో జరిగే ఆర్జిత సేవలు, నిత్యకల్యాణం కార్యక్రమాలను ఆలయంలో అంతరంగికంగా ఆలయ అధికారులు నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో అధికారులు యాదగిరిగుట్టలో హెలీప్యాడ్ సిద్ధం చేశారు. భద్రతా ఏర్పాట్లను రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ పరిశీలించారు. 

లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనం అనంతరం ఖమ్మంలో నిర్వహించే బీఆర్ఎస్ భారీ బహిరంగసభకు సీఎం కేసీఆర్ సహా జాతీయ నేతలు వెళ్లనున్నారు. బీఆర్‌ఎస్‌ తొలి సభ కావడంతో సెంటిమెంట్‌గా లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఖమ్మంలో బీఆర్‌ఎస్‌ సభకు సంబంధించి  అన్ని  ఏర్పాట్లు  చకచకా జరుగుతున్నాయి.  మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.