భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: పీహెచ్‌సీల్లో డాక్టర్ల కొరత, ఇతరత్రా కారణాలతో గర్భిణులు డెలివరీ కోసం పట్టణాల బాట పడుతున్నారు. పట్టణాల్లోని ప్రైవేట్ హాస్పిటల్స్‌తో పాటు జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డెలివరీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా జిల్లాలో మాత్రం మార్పు రావడం లేదు. జిల్లాలోని 11 పీహెచ్‌సీల్లో ఏడాదిగా 50 లోపే డెలివరీలు చేయడం గమనార్హం. మరో రెండు పీహెచ్సీసీలో ఏడాదిగా ఒక్క ప్రసవం కూడా చేయలేదు. పూర్తి ఏజెన్సీ ప్రాంతంలోనూ డెలివరీ కోసం అప్పు చేసి మరీ ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు.
పీహెచ్‌సీల్లో టార్గెట్ రీచ్ కావట్లే..
జిల్లాలో 29 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఇందులో 15 పీహెచ్‌సీలు 24 గంటల హాస్పిటల్స్‌గా ఉన్నాయి. 24 గంటల హాస్పిటల్స్‌లలో నెలకు కనీసం 10 డెలివరీలు చేయాలనే టార్గెట్ ఉంది. మిగిలిన పీహెచ్సీలలోనూ డెలివరీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశాలున్నాయి. సుజాతనగర్, జగన్నాధపురం పీహెచ్‌సీల్లో ఏడాదిగా ఒక్క డెలివరీ కూడా చేయకపోవడం గమనార్హం. 11 పీహెచ్‌సీల్లో 50 లోపు ప్రసవాలు జరిగాయి. జిల్లాలోని 29 పీహెచ్‌సీల్లో గత ఆర్థిక సంవత్సరం 1,990 డెలివరీలు చేయగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 819 ప్రసవాలు మాత్రమే చేశారు.
పట్టణాలకు పరుగు
ఏడాదిగా జిల్లా వ్యాప్తంగా గవర్నమెంట్ హాస్పిటల్స్‌లలో 10,348, ప్రైవేట్ హాస్పిటల్స్‌లలో 4,898 డెలివరీలు అయ్యాయి. ఏప్రిల్ నుంచి ఈ నెల 25 వరకు గవర్నమెంట్ హాస్పిటల్స్‌లలో 3,827, ప్రైవేట్ హాస్పిటల్స్‌లలో 1,463 డెలివరీలు జరిగాయి. కొత్తగూడెంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రంతో పాటు పాల్వంచ, భద్రాచలం, ఇల్లందులోని గవర్నమెంట్ హాస్పిటల్స్‌తో పాటు ప్రైవేటు హాస్పిటల్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్న జిల్లా ప్రజలు పీహెచ్‌సీలకు వెళ్లేందుకు వెనకాడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డాక్టర్ల కొరతతో పాటు నిర్లక్ష్యం, అంతంత మాత్రంగా ఉన్న సౌకర్యాలు, డెలివరీ టైమ్‌లో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేసి చేతులు దులుపుకోవడంతో పల్లెల్లోని గర్భిణులు పైసలు ఖర్చయినా సమీపంలోని పట్టణాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్, జిల్లా ఆసుపత్రికి వెళ్లేందుకే ఇష్టపడుతున్నారు. కొన్ని పీహెచ్సీలలో సౌకర్యాలు ఉన్నా డాక్టర్ల కొరతతో డెలివరీలు పెద్దగా చేయడం లేదు. చర్ల మండలం సత్యనారాయణపురం పీహెచ్సీలో గత ఏడాది 243 డెలివరీలు చేయడం విశేషం. 24 గంటల పీహెచ్సీలలో ఏడాదికి కనీసం 120 డెలివరీలు చేయాల్సి ఉండగా 9 పీహెచ్‌సీల్లో వంద లోపు ప్రసవాలే జరిగాయి. రేగళ్ల, పెనగడప, రొంపేడు, పట్వారీగూడెం, జానంపేట పీహెచ్‌సీల్లో 25 లోపే ప్రసవాలు జరిగాయి. పీహెచ్‌సీల్లో డెలివరీలు పెంచాలని హెల్త్ మినిష్టర్, కలెక్టర్ అనుదీప్ ఆదేశిస్తున్నా మార్పు రావడం లేదని అంటున్నారు. పీహెచ్‌సీల్లో డెలివరీలు జరిగేలా చూసేందుకు ప్రోగ్రాం ఆఫీసర్ ఉన్నా పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో ఫలితం ఉండడం లేదని అంటున్నారు. పక్కనే సర్కారు దవాఖానా ఉన్నా భరోసా లేక డెలివరీల కోసం సమీప పట్టణానికి వెళ్తున్న గ్రామీణులకు నమ్మకం కల్పించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది