స్పిల్​వే ఎత్తు పెంచడం వల్లే మిడ్​ మానేరు కట్ట కొట్టుకుపోయింది!

స్పిల్​వే ఎత్తు పెంచడం వల్లే మిడ్​ మానేరు కట్ట కొట్టుకుపోయింది!
  • 2016లో జరిగిన ఘటనలో ప్రాథమికంగా తేల్చిన విజిలెన్స్​
  • బీఆర్ఎస్​ హయాంలో ఏజెన్సీని మార్చి అంచనాలను దాదాపు3 రెట్లు పెంచినట్టు గుర్తింపు
  • ఏడేండ్లపాటు ఎంక్వైరీనితొక్కి పెట్టిన గత​ సర్కారు
  • కాంగ్రెస్​ పవర్​లోకి రాగానే పాత ఫైళ్ల దుమ్ము దులిపిన విజిలెన్స్​ ఆఫీసర్లు
  • ఇరిగేషన్​ శాఖ​ నుంచి పలు కీలక ఫైళ్ల స్వాధీనం.. వివరాలపై ఆరా

హైదరాబాద్, వెలుగు: 2016లో మిడ్​మానేరు ప్రాజెక్టు కొట్టుకుపోయేందుకు గల కారణాలను విజిలెన్స్​ ఆఫీసర్స్​ ప్రాథమికంగా గుర్తించారు. డ్యామ్​ నిర్మాణ సమయంలో ఎర్త్​బండ్ కన్నా  స్పిల్​వే ఎత్తు పెరగడం,  దీని వల్ల భారీ వరద వస్తే ఆనకట్ట కొట్టుకుపోతుందని తెలిసినా అధికారులు, కాంట్రాక్ట్​ సంస్థ ప్రతినిధులు పట్టించుకోలేదని తేల్చినట్టు సమాచారం.  మిడ్​ మానేరు డ్యామ్​కొట్టుకుపోయిన ఘటనపై తాజాగా విచారణ చేస్తున్న విజిలెన్స్​ డిపార్ట్​మెంట్​ ప్రాథమికంగా ఆయా అంశాలను గుర్తించినట్టు తెలిసింది. ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి కొద్ది రోజుల ముందు నుంచే వరదలు వస్తున్నా, స్పిల్​ వే ఎత్తును ఎక్కువగా నిర్మించడం, మధ్యలో కాంట్రాక్టర్​ను మార్చడం, అంచనాలను పెంచేసి ఇవ్వడం లాంటి విషయాలు విజిలెన్స్​ విచారణలో తేలినట్టు సమాచారం.

 ఏడేండ్ల పాటు ఈ ఎంక్వైరీని బీఆర్ఎస్ సర్కారు తొక్కిపెట్టగా, కాంగ్రెస్​ అధికారంలోకి రావడంతో విజిలెన్స్ విచారణ స్పీడ్​ అందుకున్నది. ఈ క్రమంలో ఇటీవల విజిలెన్స్​ అధికారులు జలసౌధకు వచ్చి, పలు కీలక ఫైళ్లన్నింటినీ తీసుకెళ్లినట్టు అధికారవర్గాల ద్వారా తెలుస్తున్నది. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీ– 9లో చేపట్టిన ఈ మిడ్​మానేరు ప్రాజెక్టుకు సంబంధించి పది రకాల డాక్యుమెంట్లను ఇవ్వాలని ఇరిగేషన్​ అధికారులను విజిలెన్స్​ డిపార్ట్​మెంట్​ అడిగినట్టు తెలిసింది. దానికి సంబంధించి విజిలెన్స్​ డిపార్ట్​మెంట్​ నెలన్నర కింద ఇరిగేషన్​ అధికారులకు ఓ మెమో కూడా జారీ చేసినట్టు సమాచారం. 

స్పిల్​ వే ఎత్తు ఎక్కు ఉండడం వల్లే..

మామూలుగా డ్యాముల్లో ఎర్త్​ బండ్​/ఎర్త్​ డ్యామ్​లతో పోలిస్తే స్పిల్​ వే ఎత్తు తక్కువగా ఉంటుంది. అప్పుడే గేట్లు ఎత్తినప్పుడు వరద ఎలాంటి ఆటంకాల్లేకుండా దిగువకు వెళ్లిపోతుంది. అయితే, మిడ్​ మానేరు నిర్మాణ సమయంలో కాంట్రాక్ట్​ సంస్థ ఎర్త్​ బండ్​తో పోలిస్తే స్పిల్​ వేని ఎక్కువ ఎత్తులో నిర్మించినట్టు విజిలెన్స్​ ఎంక్వైరీలో ప్రాథమికంగా తేల్చినట్టు సమాచారం. వరదలు మొదలయ్యాక అధికారులు పలుమార్లు మిడ్​మానేరు పనులను పరిశీలించారని, ఎగువన అప్పర్​ మానేరు నుంచి నిరంతరాయంగా వరదలు వస్తున్నా మిడ్​మానేరు వద్ద కనీస చర్యలను సూచించిన దాఖలాలు లేవని తేల్చినట్టు తెలిసింది. స్పిల్​వే ఎత్తు ఎక్కువగా ఉండడం వల్ల ఎడమ ఎర్త్​ బండ్​ కొట్టుకుపోయిందని, ఫలితంగానే అప్పటికే జరిగిన రూ.30 కోట్ల పనులకు నష్టం జరిగినట్టు తేల్చిందని సమాచారం. వాస్తవానికి స్పిల్​ వే సామర్థ్యాన్ని 5.08 లక్షల క్యూసెక్కుల వరద అంచనాతో నిర్మించినా.. కొట్టుకుపోయిన రోజు వచ్చిన వరద కేవలం లక్ష క్యూసెక్కులే కావడం గమనార్హం. 

ఆ రికార్డులు ఇవ్వండి..

మిడ్​ మానేరు డ్యామ్​ నిర్మాణ విషయంలోనూ పలు అంశాలు బయటపడుతుండడంతో విజిలెన్స్​ డిపార్ట్​మెంట్​ దానిపై సీరియస్​గా దృష్టి పెట్టినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఇటీవల జలసౌధలో ఉన్నతాధికారులతో సమావేశమైన విజిలెన్స్​ అధికారులు డ్యామ్​కు సంబంధించిన ఫైళ్లను తీసుకెళ్లారని సమాచారం. దాంతో పాటు వాళ్లకు కావాల్సిన 10 అంశాలను లిస్ట్​ చేసి ఇచ్చారని తెలిసింది. 

పూర్తి సమాచారంతో టెక్నికల్​ శాంక్షన్​ ఎస్టిమేట్​, కాంట్రాక్ట్​ సంస్థలతో చేసుకున్న ఒరిజినల్​ అగ్రిమెంట్, ఒరిజినల్​ ఆఫీస్​ కరస్పాండెన్స్​ ఫైల్​తో పాటు నోట్​ఫైల్స్, పనుల అంచనాలు/వర్క్​ స్లిప్స్​, ప్రతిపాదనల్లో మార్పులు, అనుమతులు, ఒరిజినల్​ అగ్రిమెంట్​కు అనుబంధంగా చేసుకున్న ఒప్పందాల వివరాలు, అంచనాలు/ధరల పెంపునకు సంబంధించిన రికార్డులు, ప్రాజెక్టు నిర్మాణం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉన్నతాధికారుల ఇన్​స్పెక్షన్​ రిపోర్ట్స్​, ఫిర్యాదులు వాటిపై తీసుకున్న చర్యలు, వాటికి సంబంధించి ఏవైనా అనుబంధ రికార్డులు, ప్రాజెక్టులో భాగమైన ఏఈఈ, డీఈఈ, ఈఈ, ఎస్ఈ, సీఈ/ఈఎన్సీల వివరాలను పూర్తిగా అందజేయాలని పేర్కొంటూ ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​కు  లేఖ రాసినట్టు తెలిసింది.

లెఫ్ట్​ సైడ్​ బండ్ అంచనాల పెంపు..

కాంట్రాక్ట్​ సంస్థ నిర్లక్ష్యం కారణంగా ఎర్త్​ బండ్​కు 130 మీటర్ల మేర గండి పడి నష్టం జరగడంతో ఆ పనులను చేపడుతున్న ఐవీఆర్​సీఎల్​ అనే కంపెనీని అధికారులు పక్కనపెట్టేశారు. అయితే, అప్పటికే ఆ పనులను రూ.122.30 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. సంస్థను పక్కనపెట్టాక అంచనా వ్యయాన్ని రూ.347 కోట్లకు ఒకేసారి పెంచేశారని ప్రాథమికంగా గుర్తించినట్టు తెలిసింది.

అప్పటికే రైట్​ ఎర్త్​ బండ్​ పనులు స్లోగా జరుగుతున్నాయన్న కారణంతో ఆ పనులను చేస్తున్న పుణెకు చెందిన యశోదీప్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ అనే సంస్థ కాంట్రాక్ట్​ను రద్దు చేసి పాత ధరల ప్రకారమే రాజరాజేశ్వరి కన్​స్ట్రక్షన్స్​ అనే సంస్థకు అప్పగించారు. కానీ, రైట్​ ఎర్త్​ బండ్​ విషయంలో మాత్రం అంచనా వ్యయాన్ని ఒకేసారి దాదాపు 3 రెట్ల వరకు పెంచారని తేల్చారు. అసలు డ్యామ్​నిర్మాణ సమయంలో కన్​స్ట్రక్షన్​ ప్రొటోకాల్​ను పాటించలేదని ప్రాథమికంగా గుర్తించినట్టు తెలిసింది.