గుండెగాం గోస తీరేదెన్నడు..! పునరావాసం కోసం నిర్వాసితుల ఎదురుచూపులు

  •     ఆర్అండ్ఆర్​ ప్యాకేజీ ప్రకటించి ఏడాది పూర్తి
  •     ఇంతవరకు రిలీజ్ కాని రూ.61.30 కోట్లు
  •     భైంసాలోనే 200 కుటుంబాలు

 భైంసా, వెలుగు : ఎన్నో ఏండ్లుగా నీట మునుగుతున్న భైంసా మండలంలోని గుండెగాం గ్రామ ప్రజల గోస తీరడంలేదు. పల్సికర్​ రంగారావు ప్రాజెక్టు బ్యాక్​ వాటర్​కారణంగా పదేండ్లుగా ఆ ఊరు నీట మునుగుతూ వస్తోంది. ప్రతి ఏటా ఊళ్లోకి నీళ్లు వచ్చినప్పుడల్లా ఆఫీసర్లు, పాలకులు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ వచ్చారు. గతేడాది సైతం నీళ్లు రావడంతో దాదాపు వంద కుటుంబాలకు భైంసాలోని డబుల్​బెడ్రూం ఇండ్లలో పునరావాసం కల్పించారు.

మరి కొన్ని కుటుంబాలు అద్దెకుంటూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పరిష్కారం కావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రూ.61.30 కోట్లు ప్రకటించి..

ప్రాజెక్ట్​ బ్యాక్​ వాటర్​ కారణంగా గతేడాది గుండెగాంలోని 240 ఇండ్లు నీట మునిగాయి. 20 వరకు ఇండ్లు కూలిపోయాయి. పునవావాసంగా భైంసాలోని డబుల్ ​బెడ్రూం ఇండ్లలో వంద కుటుంబాలను తాత్కలికంగా నివాసముంచారు. మరో వంద కుటుంబాలు అద్దెకుంటున్నారు. వ్యవసాయ కుటుంబాలకు చెందిన వీరంతా ఇక్కడి నుంచే గ్రామానికి రాకపోకలు సాగిస్తున్నారు. ముంపునకు గురికాని 70 కుటుంబాలు గుండెగాంలోనే ఉంటున్నారు. కాగా గ్రామస్తుల పునరావాసం కోసం గతేడాది జులైలో ​ప్రభుత్వం ఆర్అండ్ఆర్​ ప్యాకేజీ ప్రకటించి రూ.61.30 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో నవంబర్​లో పంచాయతీ రాజ్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖ ఆఫీసర్లు గ్రామంలో సర్వే చేశారు. కుటుంబాలు, జనావాసాలు, ఓపెన్​ప్లాట్లు, ప్రజల జీవన స్థితిగతులను పరిగణలోకి తీసుకున్నారు. మొత్తం 271 కుటుంబాలు ఉన్నట్లు లెక్కతేల్చి,16521.74 యార్డుల విస్తీర్ణంలో నివాస గృహాలు, 15719.74 యార్డుల్లో ఓపెన్​ప్లాట్లు ఉన్నట్లు నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందించారు. కుటుంబంలో 18 ఏండ్లు పైబడిన ఒక్కొక్కరికి రూ.7.61లక్షల పరిహారం ఇచ్చేలా ఆఫీసర్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 

నిధులు విడుదల కాక..

గుండెగాం గ్రామస్తులకు పునరావాసం కోసం ఆఫీసర్లు రెండు స్థలాలను గుర్తించారు. మాటేగాం టోల్​ప్లాజా దగ్గరలోని ఎగ్గాం శివారుతోపాటు సిద్దూర్​గ్రామ శివారులో స్థలాలను గుర్తించారు. అయితే గ్రామస్తులు సిద్దూర్​ గ్రామ శివారులో పునరావాసం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆఫీసర్లు సైతం ఆ స్థలాన్ని ఎంపిక చేసి ఉన్నతాధికారులకు నివేదించారు. అయితే, ప్రకటించిన నిధులు విడుదల కాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. దీంతో పునరావాసం లేక గుండెగాం గ్రామస్తుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికైనా పరిహారం ప్రకటించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఉన్నతాధికారులకు విన్నవించాం

గుండెగాం గ్రామస్తుల పునరావాస సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాం. ఆర్అండ్ఆర్​ప్యాకేజీ నిధుల విడుదలలో ఆలస్యమవుతోంది. ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని విన్నవించాం. నిధులు విడుదల కాగానే శాశ్వత పునరావాస పనులు చేపడుతాం.

-  రవికుమార్, ఆర్డీవో, భైంసా