మునుగోడు ఉప ఎన్నికతో భారీగా పెరిగిన లిక్కర్ సేల్స్ 

  • ఉప ఎన్నికతో భారీగా పెరిగిన లిక్కర్ సేల్స్ 
  • రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్​లో రూ.2,700 కోట్లు, అక్టోబర్​లో రూ.3,037 కోట్ల అమ్మకాలు 
  • ఇతర జిల్లాల నుంచి మునుగోడుకు లిక్కర్ సప్లై

హైదరాబాద్, వెలుగు : మునుగోడులో మద్యం ఏరులై పారింది. ఉప ఎన్నిక కారణంగా వందల కోట్ల మద్యం నియోజకవర్గానికి చేరింది. బైపోల్ షెడ్యూల్ మొదలు.. ఎన్నిక జరిగే వరకు నెల రోజుల వ్యవధిలో మునుగోడులో దాదాపు రూ.300 కోట్ల మద్యం తాగారు. చుట్టుపక్కల ఉన్న జిల్లాలతో పాటు ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున మద్యం మునుగోడుకు సరఫరా అయింది. రాష్ట్రంలో సెప్టెంబర్​లో రూ.2,700 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా, అక్టోబర్​లో రూ.3,037 కోట్ల అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ లెక్కలు చెబుతున్నాయి. అంటే రూ.300 కోట్లకు పైగా సేల్స్ పెరిగాయి.

ఈ ఏడాదిలో ఇవే రికార్డు స్థాయి సేల్స్ అని అధికారులు చెబుతున్నారు. ఉప ఎన్నిక వల్ల కొన్ని జిల్లాల్లో సేల్స్ పెరిగాయని, ఆ మద్యమంతా మునుగోడుకు సరఫరా అయిందని పేర్కొంటున్నారు. అక్టోబర్ 5న దసరా ఉన్నప్పటికీ, పండుగకు సంబంధించి మద్యం లిఫ్టింగ్ అంతా సెప్టెంబర్ నెలాఖరులోనే జరిగిందని చెప్పారు. కాగా, లిక్కర్ సేల్స్ ఇన్ కమ్ లో 85 శాతానికి పైగా సర్కార్ ఖజానాకే జమ అవుతోంది. దీంతో ఉప ఎన్నిక కారణంగా సర్కార్ కు ఆదాయం కూడా పెరిగింది. 

ఈ జిల్లాల నుంచే సప్లై..  
మునుగోడు నియోజకవర్గం నల్గొండ జిల్లా పరిధిలో ఉంది. ఈ జిల్లాతో పాటు మరో ఐదు జిల్లాల నుంచి ఎక్కువ మద్యం మునుగోడుకు సప్లై అయినట్లు సేల్స్​ను బట్టి తెలుస్తోంది. హైదరాబాద్​లో సెప్టెంబర్​లో రూ.299 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా.. అక్టోబర్ లో రూ.345 కోట్ల అమ్మకాలు జరిగాయి. రంగారెడ్డి జిల్లాలో రూ.59 కోట్లు, నల్గొండలో రూ.32 కోట్లు, మేడ్చల్​మల్కాజ్​గిరిలో రూ.21 కోట్లు, మహబూబ్​నగర్​లో రూ.16 కోట్లు, కరీంనగర్​లో రూ.50 కోట్లు అధికంగా అమ్మకాలు జరిగాయి. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గం నుంచి మునుగోడుకు ప్రచారానికి వస్తున్న లీడర్లతో మద్యం తెప్పించుకున్నట్లు తెలిసింది. 

గ్రామాల్లో ఖాళీ సీసాల గుట్టలు..  
ప్రధాన పార్టీలన్నీ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఓటర్లకు విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేశాయి. తాగినోళ్లకు తాగినంత.. తిన్నోళ్లకు తిన్నంత అనేలా దావత్‌‌‌‌లు ఇచ్చాయి. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి అనే తేడా లేకుండా క్యాంపెయిన్ కు వచ్చిన వాళ్లందరికీ వివిధ పార్టీల నేతలు లిక్కర్ సప్లై చేశారు. మంత్రి మల్లారెడ్డి మందు పోస్తున్న ఫొటో కూడా సోషల్​మీడియాలో వైరల్​అయింది. ఈ స్థాయిలో మద్యం పంపిణీ జరగడంతో ఏ గ్రామంలో చూసినా ఖాళీ సీసాల గుట్టలు కనిపిస్తున్నాయి. కాగా, మునుగోడుకు అధికంగా మద్యం సప్లై కావడంపై వివిధ రకాల కామెంట్లు వస్తున్నాయి. ఈ స్థాయిలో నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చేస్తే బాగుండేదని పలువురు అంటున్నారు.