దుందుభిపై పూర్తిగా ధ్వంసమైన కాజ్‌వే

దుందుభిపై పూర్తిగా ధ్వంసమైన కాజ్‌వే
  • బస్సులు నిలిపివేసిన ఆర్టీసీ
  • 10 గ్రామాలకు రాకపోకలు బంద్
  • నిత్యం ఇబ్బందులు పడుతున్న ప్రజలు
  • ప్రపోజల్స్‌ పంపినా పట్టించుకోని సర్కారు

ఉప్పునుంతల, వెలుగు: 

నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల, -వంగూర్ మండలాల సరిహద్దులో దుందుభి నదిపై ఉన్న కాజ్‌వే ధ్వంసం కావడంతో 10 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్సులు కూడా వెళ్లలేని పరిస్థితి ఉండడంతో హైదరాబాద్,  కల్వకుర్తికి రాకపోకలు బంద్‌ అయ్యాయి.  కాజ్‌వే  ఆరేండ్ల కిందనే ఓ వైపు ధ్వంసం అయ్యిందని, ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని బాధిత ప్రజలు వాపోతున్నారు. హైలెవల్ బ్రిడ్జి మంజూరు చేయాలని ఎన్నిసార్లు ధర్నాలు చేసినా.. ప్రపోజల్స్ పంపామని చెప్పి తప్పించుకుంటున్నారని మండిపడుతున్నారు.

20 ఏండ్ల కింద..

20 ఏండ్ల కింద వంగూరు మండలం ఉల్పర, ఉప్పునుంతల మండల మొలగర గ్రామాల మధ్య దుందుభి నదిపై కాజ్‌వే నిర్మించారు. మొదట సైడ్ వాల్స్‌ ఏర్పాటు చేసి మధ్యలో రాళ్లు, మట్టిని పోసి రాకపోకలకు వీలుగా రోడ్డు నిర్మించారు.  దాదాపు ఐదేళ్ల తర్వాత సీసీ వేశారు.  అయితే, అంతకుముందున్న మట్టిని తొలగించకుండానే సీసీ వేయడంతో వరద తాకిడికి ఆరేండ్ల కింద ఒకవైపు ధ్వంసం అయ్యింది. ఈ సారి భారీ వర్షాలు కురవడంతో మూడు నెలలు ఏకధాటిగా వరద పారింది.  దీంతో మిగతా వైపు ఉన్న సీసీ కూడా కొట్టుకుపోయింది.

నిత్యం ఇబ్బందులు

కాజ్‌వే ధ్వంసం కావడంతో వంగూరు మండలంలోని ఉల్పర, మిట్ట సదగోడు, కొనాపూర్, ఎల్లమ్మ రంగాపూర్, ఎల్లికల్లు ఉప్పునుంతల మండలంలోని మొలగర, జప్తి సదగోడు, పెద్దాపూర్, లక్ష్మాపూర్, మామిళ్లపల్లి గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఉప్పునుంతల మీదుగా ఉల్పర నుంచి కల్వకుర్తి వెళ్లే బస్ ఆగిపోవడంతో ప్రయాణికులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పనులు ఉన్న వాళ్లు, కూలీలు  ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాజ్‌వే దాటాల్సి వస్తోంది.  నది పారుతుండడంతో పాటు సీసీ పాకురు పట్టి ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. 

2021లో ప్రపోజల్స్‌

దుందుభిపై హైలెవల్‌ బ్రిడ్జి నిర్మించాలని ప్రతిపక్ష నేతలు, స్థానికులు ఆరేళ్లుగా కోరుతున్నారు.  దీంతో 2021లో ఆర్‌‌అండ్‌బీ అధికారులు రూ.30 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.  కానీ, నేటికీ మంజూరు కాలేదు. కనీసం తాత్కాలిక పనులు కూడా చేపట్టలేదు. అయితే, నిరుడు తాత్కాలిక పనుల కోసం ఆర్‌‌అండ్‌బీ ఏఈ రూ.20 లక్షలతో ప్రపోజల్స్ పెట్టారు.  దీంతో ఫీల్డ్‌ విజిట్ చేసిన అచ్చంపేట ఆర్‌‌అండ్‌బీ డీఈ నాగలక్మి, పీఆర్‌‌ ఈఈ దామోదర్ రావు రూ.20 లక్షలు సరిపోవని, రూ. 50 లక్షలతో ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి పనులు చేయలేదు.

సొంత ఖర్చులతో రిపేర్లు చేసిన సర్పంచ్

సీసీ కాజ్వే ధ్వంసం కావడంతో వాహనాలే కాదు ప్రజలు నడుకుంటూ వెళ్లేందుకు కూడా వీలు లేకుండా పోయింది.  అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఉల్పర గ్రామ సర్పంచ్ శ్రీజ రామకృష్ణారెడ్డి సొంతంగా రూ.3 లక్షలు ఖర్చు పెట్టి తాత్కాలికంగా రిపేరు చేయించారు.  సిమెంట్ పైపులు(గూణలు) వేయించి, పైన మట్టి పోయించారు. కానీ, వరద ప్రవాహం, ఓవర్ లోడ్‌తో ఇసుక ట్రాక్టర్లు వెళ్లడంతో కొన్నాళ్లకే అది కోతకు గురైంది.  

 ఎమ్మెల్యే పట్టించుకుంటలేడు

 ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేడు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చూడలేక రూ. 3 లక్షలతో రిపేర్లు చేయించిన. అయినా వరదకు మళ్లీ ధ్వంసం అయ్యింది. ఎమ్మెల్యేకే పట్టింపు లేకుంటే నాయకులు ఏం చేస్తరు? ఆయన పాలనపై దుందుభి పరివాహక ప్రజలు విసిగిత్తి పోయిన్రు.
–జిల్లెళ్ల రామకృష్ణ రెడ్డి,  టీఆర్‌‌ఎస్‌ నేత, ఉల్పర  

రూ.30 కోట్లతో ప్రతిపాదనలు

దుందుభి నదిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం కోసం 2021లో రూ. 30 కోట్లతో ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపినం. కానీ,  ఇప్పటి వరకు మంజూరీ కాలేదు.  ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే పనులు మొదలు పెడుతం.  
 –జలందర్, ఆర్‌‌అండ్‌బీ డీఈ