గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో కుండపోతగా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా హిమాయత్ నగర్, నారాయణ్ గూడ మొత్తం వరద నీటిలో మునిగిపోయాయి. వరద నీరు భారీగా చేరడంతో ఇక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు.. నిన్నటి వరకు మూసారాంబాగ్ బ్రిడ్జి కింద నుంచి వరద నీరు వెళ్లాయి. సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షంతో ఇప్పుడు మూసారాంబాగ్ బ్రిడ్జి మీద నుంచి వర్షం నీళ్లు వెళ్తున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంబర్ పేట, మూసారాంబాగ్ బ్రిడ్జిపై భారీగా నీరు నిలిచిపోయింది. మోకాలు లోతు నీళ్లు చేరడంతో వాహనాదారుల ఇక్కట్లు అన్ని ఇన్నీ కావు. వాహనదారులు గోల్నాక బ్రిడ్జి మీదుగా వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
నగరంలోని బోరబండ, ఎర్రగడ్డ, సనత్ నగర్, యూసఫ్ గూడ, అమీర్‌పేట్, ఎస్సార్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది.
మాదాపుర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపుర్ ప్రాంతాల్లో మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. రాజేంద్రనగర్, అత్తాపూర్, గండిపేట, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బేగంబజార్, నాంపల్లి, బషీర్ బాగ్, నారాయణగూడ, హిమాయత్ నగర్, లిబర్టీ, అంబర్పేట్, కాచిగూడ, నల్లకుంట విద్యానగర్‌లో భారీ వర్షం కురుస్తోంది.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీ వర్షం కారణంగా వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో చెట్లు నేలకూలి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.