తమిళనాడును మిగ్‌జాం తుపాను వణికిస్తోంది. తుపాన్ ప్రభావంతో తమిళనాడు అతలాకుతలమైంది. ఎడతెరపిలేకుండా కురుస్తోన్న కుండపోత వర్షాలతో చెన్నై సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. జనజీవనం స్తంభించిపోయింది.
చెన్నైతో పాటు మరో మూడు జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మంగళవారం (డిసెంబర్ 5న) చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలతో పాటు పలు విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడనున్నాయి. అత్యవసర సర్వీసులు మాత్రం అందుబాటులో ఉంటాయని చెప్పింది.
తమిళనాడులో తుపాను పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఈ మేరకు ఆయన తమిళనాడు సీఎం స్టాలిన్‌తో మాట్లాడారు. తుపాను ప్రభావం, నష్టాలకు సంబంధించిన వివరాలను ఆరా తీసినట్లు సమాచారం. భారీ వర్షాల ప్రభావంతో ఇప్పటికే మూత పడిన చెన్నై విమానాశ్రయాన్ని మంగళవారం ఉదయం 9గంటల వరకు మూసి ఉంచనున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
భారీ వర్షాల కారణంగా చెన్నైలో ఇప్పటివరకు ఐదుగురు మృతిచెందినట్లు అక్కడి అధికారులు చెప్పారు. మిగ్‌జాం తుపాను కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం- నెల్లూరు మధ్య ఈ అర్ధరాత్రి తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
మిగ్‌జాం తుపాను తీవ్ర ప్రభావం చూపుతున్న క్రమంలో తమిళనాడు సీఎం స్టాలిన్ రాజకీయ పార్టీలకు కీలక విజ్ఞప్తి చేశారు. తుపాను విపత్తు నుంచి బయటపడేందుకు అన్ని రాజకీయ పార్టీలు, వాలంటీర్లు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరారు. సహాయక చర్యల్ని వేగవంతం చేసేందుకు 13మంది మంత్రులను నియమించారు. భారీ వర్షాల నేపథ్యంలో స్టాలిన్ ప్రభుత్వం పలు ప్రైవేటు కంపెనీలకు కీలక విజ్ఞప్తి చేసింది. ప్రైవేటు కంపెనీల యాజమాన్యాలు తమ ఉద్యోగులకు మంగళవారం (డిసెంబర్ 5న) సాధ్యమైనంత మేరకు వర్క్‌ఫ్రం హోమ్ ఇవ్వాలని కోరింది.
ఐఫోన్ల ఉత్పత్తికి బ్రేక్
భారీ వర్షాల ప్రభావం ఐఫోన్ల తయారీపై పడింది. తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ సంస్థ శ్రీపెరంబుదూర్‌లో ఉన్న తయారీ ప్లాంట్‌లో యాపిల్ ఐఫోన్లను ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. మంగళవారం (డిసెంబర్ 5న) తిరిగి ప్రారంభించడంపై సంస్థ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మరో కంపెనీ పెగట్రాన్ సైతం ఐఫోన్ తయారీని నిలిపివేసింది. ఈ సంస్థకు చెన్నై సమీపంలో ఐఫోన్ ఉత్పత్తి ప్లాంట్ ఉంది.