మూసీ నదికి పోటెత్తుతున్న వరద.. నిండుకుండలా హుస్సేన్ సాగర్

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మూసీ నదికి వరదనీరు భారీగా చేరుతోంది. నల్లగొండ జిల్లా కేతపల్లి మండలం వద్ద మూసీ నదిలోకి పెద్ద ఎత్తున వరద చేరుకుంటోంది. మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 642.50 అడుగులుగా ఉంది. ఇప్పటికే ఇరిగేషన్ శాఖ అధికారులు రెండు గేట్లను (1.5 Fts) ఎత్తి.. దిగువకు నీటిని విడుదల చేశారు. 1880 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మూసీ దిగువ ప్రాంతాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. 

నిండుకుండలా హుస్సేన్ సాగర్

రెండు రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయమయ్యాయి. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ నిండుకుండను తలపిస్తోంది. వరద నీరు హుస్సేన్ సాగర్ లోకి భారీగా చేరుకుంటోంది. ఎగువ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్ కు ఇన్ ఫ్లో పెరిగింది. హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 514.75 అడుగులు. తూముల ద్వారా దిగువ ప్రాంతాలకు వరద నీటిని ఇరిగేషన్ శాఖ అధికారులు వదులుతున్నారు.